ఈ నెల 28 నుంచి 31 వరకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌లు జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, మహాత్మాగాంధీ పేరును తొలగించిన అంశంలో ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పోరాటం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నాయకులు గ్రామ సభలు పెట్టి ఉపాధి హామీ కూలీలతో మాట్లాడనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నాయకులు నియోజక వర్గాలలో ఒక్కో గ్రామ సభలో పాల్గొననున్నారు. ఉదయం ఒక గ్రామంలో.. సాయంత్రం ఒక గ్రామంలో ఏర్పాటు చేసే గ్రామ సభలలో పాల్గొంటారు. ఈ సభలలో జాతీయ ఉపాధి చట్టం జాబ్ కార్డ్ హోల్డర్లతో సమావేశం సహా పంక్తి భోజనం చేయనున్నారు. 28న మెదక్, మానకొండురు, 29న వేముల వాడ, ఎల్లారెడ్డి, 30న మేడారం సమ్మక్క, సారలమ్మ దర్శనం సాయంత్రం ఆలేరు నియోజక వర్గంలో గ్రామ సభ, 31న నకిరేకల్, ఇబ్రహీం పట్నం నియోజక వర్గాలలో గ్రామ సభలు నిర్వహించనున్నారు.