చంద్రగ్రహణం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల మూసివేత
Lunar eclipse effect.. Temples closed in Telugu states. ఈ సంవత్సరంలో చివరి చంద్రగహణం నేడు కనిపించనుంది. అయితే ఇది కొన్ని నగరాల్లో సంపూర్ణంగా, హైదరాబాద్‌లో
By అంజి Published on 8 Nov 2022 5:01 AM GMTఈ సంవత్సరంలో చివరి చంద్రగహణం నేడు కనిపించనుంది. అయితే ఇది కొన్ని నగరాల్లో సంపూర్ణంగా, హైదరాబాద్‌లో పాక్షికంగా కనిపిస్తుంది. గ్రహణాన్ని చూసేందుకు ప్రత్యేక పరికరాలు అవసరం లేదని నిపుణులు అంటున్నారు. హైదరాబాద్ మహానగరంలో చంద్రగ్రహణం సాయంత్రం 5.40 గంటలకు ప్రారంభమై.. 7.26 గంటలకు ముగుస్తుందని జీపీ. బిర్లా ఆర్కియాలజికల్ ఆస్ట్రోనామికల్ అండ్ సైంటిఫిక్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ ఓ ప్రకటనలో పేర్కొంది. చంద్రగ్రహణం ఎఫెక్ట్‌తో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రముఖ ఆలయాలు మూతపడ్డాయి.
వేములవాడ రాజన్న, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి, భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయాలతో పాటు అన్ని ఆలయాలను నిత్య కైంకర్య పూజల అనంతరం అర్చకులు మూసివేశారు. ఈ క్రమంలో ఉదయం వేకువ జామున ఆయా ఆలయ ద్వారాలను తెరిచి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. గ్రహణం కారణంగా ఇవాళ ఉదయం 5.30 గంటలకు వేములవాడ రాజన్న ఆలయాన్ని మూసివేశారు. తిరిగి ఇవాళ సాయంత్రం 6.18 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. పుణ్యహవచనం, సంప్రోక్షణ, నివేదన అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయాన్ని ఇవాళ ఉదయం 8.16 నిమిషాలకు అర్చకులు ద్వార బంధనం చేశారు. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 3 గంటల 30 నిమిషాలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వయంభులకు నిజాభిషేకం, నిత్య కైంకర్యాలు, చేపట్టారు. గ్రహణం కారణంగా భద్రాద్రి సీతారామ చంద్రస్వామి ఆలయాన్ని అధికారులు, అర్చకులు మూసివేశారు. గ్రహణం అనంతరం ద్వారాలు తెరిచి సంప్రోక్షణ చేయనున్నారు. బుధవారం నుంచి భక్తులను దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
అలాగే భూపాపల్లి జిల్లా కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వర ఆలయాన్ని ఉదయం అధికారులు మూసివేశారు. బుధవారం సంప్రోక్షణ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. మరో వైపు కార్తీక పౌర్ణమి సందర్భంగా గోదావరిలో భక్తులు పుణ్య స్నానాలు చేశారు. అనంతరం గోదావరిలో కార్తీక దీపాలను వదిలారు. సుబ్రహ్మణేశ్వరస్వామి వారికి మొక్కులు చెల్లించారు. చంద్రగ్రహణం సందర్భంగా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. గ్రహణం పూర్తయిన అనంతరం.. సాయంత్రం 7 గంటలకు ఆలయం తెరచి మహాసంపోక్షణ చేయనున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాలను అర్చకులు మూసివేశారు. చంద్రగ్రహణం కారణంగా ఇవాళ ఉదయం 8.30 గంటలకు మూసివేశారు. అంతకు ముందు వేకువ జామున శ్రీవారి ఆలయ ద్వారాలను తెరిచి నిత్యకైంకర్యాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రహణం అనంతరం రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి చేసిన అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. గ్రహణం కారణంగా పౌర్ణమి సందర్భంగా ఇవాళ నిర్వహించాల్సిన పున్నమి గరుడ సేవను సైతం టీటీడీ రద్దు చేసింది.
గ్రహణం కారణంగా శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామి ఆలయాలు సైతం మూతపడ్డాయి. సాయంత్రం 6.30 గంటల అనంతరం సంప్రోక్షణ పూజలు నిర్వహించి, తలుపులను తిరిగి తెరువనున్నారు. రాత్రి 8 గంటల నుంచి మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్ల అలంకార దర్శనాలను కల్పించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.