క్యూ మారింది.. వ్యాక్సిన్ సెంటర్ టూ వైన్ షాప్..!
Lockdown Effect To Wineshop. తెలంగాణలో కొత్తగా లాక్ డౌన్ ప్రకటన రావడంతో వైన్ షాపుల వద్దకు పరిగెత్తారు.
By Medi Samrat
ఇన్ని రోజులూ తెలంగాణలో లాక్ డౌన్ ఉండకపోవచ్చు అనుకున్నారు. కానీ ఊహించని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు లాక్ డౌన్ ప్రకటన ఇచ్చేశారు. తెలంగాణలో రేపటి నుంచి లాక్ డౌన్ విధించింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే కార్యకలాపాలకు అనుమతి నిచ్చింది. లాక్ డౌన్ 10 రోజుల పాటు కొనసాగనుంది. తెలంగాణలో కరోనా కేసులు, మరణాలు తగ్గినా ఇతర ప్రాంతాల్లో సెకండ్ వేవ్ ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకుని లాక్ డౌన్ నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. రంజాన్ తర్వాత లాక్ డౌన్ ప్రకటిస్తారని అనుకున్నప్పటికీ.. దానికంటే ముందే లాక్ డౌన్ ప్రకటన వెలువడింది. రేపటి నుంచే లాక్ డౌన్ అమలు చేయాలని నేటి కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది.
ఇక ఇన్ని రోజులూ వ్యాక్సిన్, టెస్టింగ్ ల కోసం క్యూలలో నిలబడ్డారు ప్రజలు. ఇప్పుడు కొత్తగా లాక్ డౌన్ ప్రకటన రావడంతో వైన్ షాపుల వద్దకు పరిగెత్తారు. చాలా వరకూ ఏరియాల్లో మద్యం బాటిళ్లను కొనడంపైనే ప్రజలు దృష్టి పెట్టారు. మద్యం దుకాణాలు తెరుస్తారో లేదో తెలియడంతో ఇప్పుడే కొనేస్తే బెటర్ కదా అని అనుకుని మద్యం షాపుల వద్దకు పరిగెత్తుతున్నారు. లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించడంతో వైన్స్‌షాపులు అందుబాటులో ఉంటాయో లేదో అన్న క్లారిటీ ఇంకా ప్రభుత్వం ఇవ్వలేదు. దీంతో మద్యం దుకాణాల వద్ద మందుబాబు క్యూ కట్టారు. సామాజిక దూరం పాటించకుండా కొన్ని చోట్ల తోపులాటలు కూడా జరిగాయి. పోలీసులు చాలా ప్రాంతాల్లో మందుబాబులు క్యూలో నిలబడేలా చర్యలు తీసుకుంటూ ఉన్నారు.