మందుబాబులకు నిజంగా షాకింగ్ న్యూస్ ఇది. మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. అయితే.. ఇది అన్నిచోట్లా కాదులెండి. మునుగోడు నియోజకవర్గ పరిధిలో మాత్రమే.
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నవంబర్ 1 తేదీ సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్ 3 తేదీ సాయంత్రం 6గంటల వరకు నల్లొండ, యాద్రాద్రి భువనగిరి జిల్లాల పరిధిలోని మునుగోడు నియోజకవర్గంలో ఉన్న వైన్ షాపులు మూసివేయాలని జిల్లా ఎక్సైజ్ అధికారి సంతోష్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇక ఉప ఎన్నిక ప్రకటన వచ్చాక మునుగోడు పరిధిలో మద్యం అమ్మకాలు పెరిగాయన్నారు. నియోజకవర్గంలో మొత్తం 7 మండలాల్లో 128 మంది ఎక్సైజ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని, వారంతా మద్యం దుకాణాల అమ్మకాలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తరువాత 2,705 లీటర్ల మధ్యం, రెండు బైక్‌లను సీజ్ చేయడంతో పాటు 48 మందిని అరెస్ట్ చేసి 118 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.