తెలంగాణలో వరుసగా ఆ మూడ్రోజులు మద్యం దుకాణాలు బంద్
తెలంగాణలో వరుసగా మూడ్రోజుల పాటు మద్యం దుకాణాలు, బార్లు పూర్తిగా మూతపడనున్నాయి.
By Srikanth Gundamalla Published on 4 Nov 2023 10:01 AM ISTతెలంగాణలో వరుసగా ఆ మూడ్రోజులు మద్యం దుకాణాలు బంద్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతోంది. ఈ నెల 30న జరగనున్న పోలింగ్‌కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు సమయం తక్కువగా ఉండటంతో రాష్ట్రంలో ప్రధాన పార్టీ నాయకులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. వరుస సమావేశాలు, సభలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు.. రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటుండం చూస్తూనే ఉన్నాయి. అయితే.. ఎన్నికల సమరం జోరుగా కనిపిస్తున్న వేళ మద్యం బాబులకు ఒక బ్యాడ్ న్యూస్ వినిపించారు ఎన్నికల అధికారులు.
తెలంగాణలో వరుసగా మూడ్రోజుల పాటు మద్యం దుకాణాలు, బార్లు పూర్తిగా మూతపడనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా మద్యం దుకాణాలు, బార్లను మూసివేస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. నవంబర్ 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మూడ్రోజుల పాటు వైన్స్ క్లోజ్ కానున్నాయి. వైన్ షాపులు, బార్లు మూసివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు లైసెన్స్ దారులకు ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు. ఈ ఆదేశాలను ఉల్లఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు హెచ్చరించారు.
అయితే.. పోలింగ్ సమయంలో ఓటర్లను ప్రభావితం చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఎన్నికల ప్రచార పర్వం మొదలవగా.. చాలా చోట్ల మద్యం పంపిణీ జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తనిఖీల్లోనూ.. అక్రమంగా తరవిస్తోన్న అక్రమ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో మాదిరి మద్యం ఏరులై పారకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నారు ఎన్నికల అధికారులు. ఈ మేరకు కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.