మునుగోడు ఎన్నికల ప్రచారంలో.. ఆసక్తి రేకెత్తిస్తోన్న కరీంనగర్‌ నేతలు

Leaders of various parties from Karimnagar district in Munugode election campaign. ఏడాది క్రితం జరిగిన కరీంనగర్‌ జిల్లాలోని హుజూరాబాద్ ఉపఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది.

By అంజి  Published on  17 Oct 2022 4:48 AM GMT
మునుగోడు ఎన్నికల ప్రచారంలో.. ఆసక్తి రేకెత్తిస్తోన్న కరీంనగర్‌ నేతలు

ఏడాది క్రితం జరిగిన కరీంనగర్‌ జిల్లాలోని హుజూరాబాద్ ఉపఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. అదేవిధంగా నల్గొండ జిల్లా మునుగోడులో జరుగుతున్న ఉప ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగల కరీంనగర్‌ జిల్లాకు చెందిన ముఖ్యనేతలు మునుగోడులో మకాం వేసి ఉప ఎన్నికను ఆసక్తికరంగా మార్చారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో బండి సంజయ్ ప్రచారంలో తనదైన ముద్ర వేయబోతున్నారు.

కరీంనగర్‌ జిల్లాకు చెందిన మరో కీలక నేత వివేక్ వెంకట్ స్వామి ఆధ్వర్యంలో మునుగోడులో సమన్వయ కమిటీ కొనసాగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జిల్లా అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్పొరేటర్లకు మునుగోడులోని ఆయా గ్రామాల ప్రచార బాధ్యతలు అప్పగించేందుకు కాషాయ పార్టీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గత కొన్ని రోజులుగా బీజేపీ ప్రచార బాధ్యతలను భుజానకెత్తుకున్నారు. పార్టీ రాజకీయ జాయినింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్న ఆయన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా స్థానిక నేతలతో సమావేశమవుతున్నారు.

మరోవైపు చౌటుప్పల్‌-1 ఎంపీటీసీ పరిధి నారాయణపూర్‌-2 ఎంపీటీసీ, చండూరు మండలంలోని బోడగింపర్తి, తస్కాని గూడెం, సిద్దేపల్లి గ్రామాల బాధ్యతలను మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌లకు మంత్రి కేటీఆర్‌ అప్పగించారు. ఎమ్మెల్సీలు ఎల్‌ రమణ, పాడి కౌశిక్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు కె చందర్‌, రసమయి బాలకిషన్‌, డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, కె విద్యాసాగర్‌రావు, వొడితెల సతీష్‌ కుమార్‌, దాసరి మనోహర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావుతో పాటు ఇతర నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.

ఇప్పటికే మునుగోడులో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. మాజీ మంత్రి డి.శ్రీధర్ బాబు గత కొన్ని రోజులుగా మర్రిగూడెం మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రాహుల్ గాంధీ నిర్వహించనున్న పాదయాత్ర ఉన్నందున.. యాత్రను పర్యవేక్షించాలని పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే మర్రిగూడెం మండల ప్రచార బాధ్యతలను జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి అప్పగించారు. మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు మునుగోడు మండల బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు.

Next Story