లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కుషాయిగూడ సీఐ, ఎస్‌ఐ
ప్రభుత్వ కార్యాలయాల్లో కొందరు అవినీతి పరులు లంచం ఇస్తేనే పనులు చేస్తామని చెబుతుంటారు.
By Srikanth Gundamalla Published on 31 May 2024 5:30 PM ISTలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కుషాయిగూడ సీఐ, ఎస్‌ఐ
ప్రభుత్వ కార్యాలయాల్లో కొందరు అవినీతి పరులు లంచం ఇస్తేనే పనులు చేస్తామని చెబుతుంటారు. ఇప్పటికే పలువురు అధికారులను ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నా.. ఇలాంటి అవినీతి తిమింగలాలకు కొంచెం కూడా బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. తాజాగా మరో ఇద్దరు పోలీసు అధికారులు లంచం తీసుకుంటుండగా ప్లాన్ వేసి మరి పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.
హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడ సీఐ వీరస్వామి, ఎస్‌ఐ షఫీ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఒక కేసు విషయంలో రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా.. వారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. భూవివాదానికి సంబంధించి ఓ కేసును సెటిల్‌మెంట్ చేసే విషయంలో కుషాయిగూడ సీఐ, ఎస్‌ఐ బాధితుడిని లంచం అడిగారు. దాంతో.. బాధితుడికి లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఇద్దరు లంచగొండి పోలీసులను పట్టుకునేందుకు ప్లాన్ చేసుకున్నారు.
సదురు వ్యక్తి వద్ద నుంచి సీఐ వీరస్వామి, ఎస్‌ఐ షఫీతో పాటు కానిస్టేబుల్ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.ఈ క్రమంలోనే కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆ తర్వాత ముగ్గురు పోలీసులను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లోనే విచారిస్తున్నారు. దాదాపు రెండు గంటలకు పైగా తనిఖీలు చేస్తూ.. అవినీతి అధికారులను ప్రశ్నిస్తోంది ఏసీబీ.