హైదరాబాద్: కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించామని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బస్సుల ఫిట్‌నెస్, ఇతర అంశాల్లో రూల్స్ పాటించకుంటే తీవ్ర చర్యలు ఉంటాయని ప్రైవేట్ ట్రావెల్స్‌ను హెచ్చరించారు. తనిఖీలు చేస్తే వేధింపులని అంటున్నారని, ఇది వేధింపులు కాదని, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకునే యాక్షన్ అని చెప్పారు. ఓవర్ స్పీడ్ నియంత్రణకు కమిటీ వేస్తామని అన్నారు.
బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బస్సు ప్రమాద ఘటనపై కర్నూలు జిల్లా అధికారులతో మాట్లాడినట్టు ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరినట్టు మంత్రి పొన్నం తెలిపారు.
అటు బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు 19 మృతదేహాలను వెలికితీసినట్టు అధికారులు వెల్లడించారు. కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయన్నారు. బస్సులో ఇద్దరు పిల్లలు సహా మొత్తం 41 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు ప్రయాణించినట్టు తెలిపారు. 21 మంది సురక్షితంగా బయటపడ్డారని పేర్కొన్నారు.