సురేంద్రపురి వ్య‌వ‌స్థాప‌కుడు కుందా సత్యనారాయణ కన్నుమూత

Kunda Satyanarayana Passed away.ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం యాదాద్రికి స‌మీపంలోని సురేంద్ర‌పురి (కుందా కళాధామం)

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Jan 2022 4:56 AM GMT
సురేంద్రపురి వ్య‌వ‌స్థాప‌కుడు కుందా సత్యనారాయణ కన్నుమూత

ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం యాదాద్రికి స‌మీపంలోని సురేంద్ర‌పురి (కుందా కళాధామం) వ్యవస్థాపకుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త కుందా సత్యనారాయణ క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ప‌రిస్థితి విష‌మించ‌డంతో బుధ‌వారం త‌న నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌స్సు 86 సంవ‌త్స‌రాలు. ఆయనకు భార్య హైమవతి, కుమారులు శ్రీనివాస్‌, ప్రతాప్‌, కుమార్తె సూర్యకుమారి ఉన్నారు. ఈ రోజు మ‌ధ్యాహ్నాం ఒంటి గంటకు జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జ‌ర‌గ‌నున్నాయి.

ఖ‌మ్మం జిల్లా బ‌స్వాపురం గ్రామానికి చెందిన కుందా స‌త్య‌నారాయ‌ణ మూడో కుమారుడు సురేంద్ర‌బాబు 1991లో మ‌ర‌ణించ‌గా.. ఆయ‌న జ్ఞాప‌కార్థం 1998లో యాదగిరిగుట్ట సమీపంలో భువనగిరి మండలం వడాయిగూడెం దగ్గర సురేంద్రపురిని సత్యనారాయణ అభివృద్ధి చేశారు. కాశీ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు గ‌ల ఆల‌యాన్నింటీని ఒకే ప్ర‌దేశంలో చూసిన అనుభూతి క‌ల‌గాల‌న్న ఉద్దేశ్యంలో 2008లో వివిధ ప్ర‌ముఖ ఆల‌యాల పోలిక‌ల‌తో దేవాల‌యాలు, దేవుళ్ల విగ్ర‌హాలు క‌ట్టించారు.

ప్రపంచంలో మొట్టమొదటి సారిగా నవ గ్రహాలకు సతీ సమేతంగా, వాహన సమేతంగా, అధి దేవత, ప్రత్యధి దేవతల సమేతంగా విడివిడిగా 9 గుడులు కట్టించారు. పంచముఖ ఆంజనేయస్వామి, శివుడు, నాగదేవత భారీ విగ్రహాలను ఏర్పాటు చేశారు. మహాభారతం, రామాయణం వంటి ఇతిహాసాలకు దృశ్య రూపమిచ్చి కళాధామాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దారు. సురేంద్రపురి యాదాద్రి దివ్యక్షేత్రానికి సమీపంలో ఉండడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు కళాధామాన్ని సందర్శిస్తుంటారు.

Next Story