రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
By - Medi Samrat |
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. సూర్యాపేట జిల్లాలో మైనింగ్ ఈ-వేలంలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని, స్వతంత్ర విచారణ చేసి టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయపరమైన విచారణలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ వేలాన్ని ముందుకు తీసుకెళ్లడం, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన సూచనలను పట్టించుకోకపోవడం, చట్టపరమైన , పర్యావరణ అనుమతులు పూర్తికాకముందే ప్రిఫర్డ్ బిడ్డర్లను ప్రకటించడం వంటి అంశాలు తీవ్ర అనుమానాలకు తావిస్తున్నాయని పేర్కొన్నారు.
సుమారు 1,100 ఎకరాల రిజర్వ్డ్ ఫారెస్ట్‌పై స్పష్టత లేకుండానే వేలం నిర్వహించారన్నారు. జియోలాజికల్ నివేదికలు సైతం లేవని, మినరల్ ఆక్షన్ రూల్స్-2015 ఉల్లంఘన జరిగిందని హైకోర్టు సూచనలు పట్టించుకోలేదని తెలిపారు. ముఖ్యంగా పర్యావరణ అనుమతులు పూర్తికాకముందే ప్రిఫర్డ్ బిడ్డర్ల ప్రకటన, కంపెనీల ఎంపికపై అనుమానాలున్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసులు ఎదుర్కొంటున్న డెక్కన్ సిమెంట్స్, ఎన్‌సీఎల్ ఇండస్ట్రీస్‌కు బ్లాక్‌ల కేటాయింపుపై సందేహాలున్నాయని తెలిపారు.టెండర్ రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అన్ని అనుమతుల తర్వాతే పారదర్శకంగా కొత్త వేలం నిర్వహించాలని సూచించారు. టెండర్ నోటీసు జారీకి ముందే మినరల్ బ్లాక్‌లను ఖచ్చితంగా గుర్తించి పూర్తి వివరాలు వెల్లడించడం తప్పనిసరి అయినప్పటికీ, ఈ నిబంధనలు పాటించలేదని విమర్శించారు.