ప్రచార రథం నుంచి పడిపోయిన కేటీఆర్.. తప్పిన పెనుప్రమాదం
ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి నామినేషన్ దాఖలు ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 9 Nov 2023 3:16 PM ISTప్రచార రథం నుంచి పడిపోయిన కేటీఆర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్లకు మరొక రోజు మాత్రమే మిగిలి ఉంది. దాంతో.. ఇవాళ నామినేషన్లు పెద్దఎత్తున దాఖలు చేస్తున్నారు అభ్యర్థులు. ప్రధాన పార్టీల నుంచి ముఖ్యనాయకులు కూడా ఇవాళే నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సహా ఇతర నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. ఆ తర్వాత ఆ పార్టీ ముఖ్య నేతలు ఇతర అభ్యర్థుల నామినేషన్ల ర్యాలీలో పాల్గొంటున్నారు. మంత్రి కేటీఆర్ ఈ నేపథ్యంలో ఆర్మూరులో బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు.
ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి నామినేషన్ దాఖలు ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. ప్రచారంలో భాగంగా నామినేషన్ ర్యాలీలో మంత్రి కేటీఆర్‌తో పాటు ప్రచార రథంపై సురేశ్‌రెడ్డి, జీవన్‌రెడ్డి ఎక్కారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్తూ ప్రజలకు అభివాదాలు చేస్తూ వెళ్లసాగారు. అయితే.. ఉన్నట్లుండి ప్రచార రథం డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. దాంతో.. ప్రచార రథంపైన ఉన్న గ్రిల్ విరిగిపోయింది. దాంతో.. పట్టుకోల్పోయిన మంత్రి కేటీఆర్ సహా సురేశ్‌రెడ్డి, జీవన్‌రెడ్డి వాహనంపై నుంచి కిందపడిపోబోయారు. కానీ.. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ గన్‌మెన్లు ఆయన్ని గట్టిగా పట్టుకున్నారు.
ఎట్టకేలకు మంత్రి కేటీఆర్‌తో పాటు ఇతర నేతలు ప్రమాదంలో పడబోయిన సంఘటనతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ప్రమాదంలో మంత్రి కేటీఆర్ సహా ఇతర నేతలకు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. వారు కిందపడిపోతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేటీఆర్‌కు గాయాలు అయ్యాయా అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.