వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదే.. 2027లో పాదయాత్ర చేస్తా: కేటీఆర్‌

మంచిర్యాల జిల్లా క్యాసంపల్లిలో ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడిన కేటీఆర్, 2028 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని 2027లో...

By -  అంజి
Published on : 13 April 2026 11:18 AM IST

KTR Padayatra 2027, BRS Independent Contest, Telangana Assembly Elections 2028, Membership Drive, Gulf Policy and Welfare Schemes

వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదే.. 2027లో పాదయాత్ర చేస్తా: కేటీఆర్‌

మంచిర్యాల జిల్లా క్యాసంపల్లిలో ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడిన కేటీఆర్, 2028 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని 2027లో రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. గత పదేళ్ల పాలనలో ప్రజలకు, పార్టీకి మధ్య ఏర్పడిన దూరాన్ని తగ్గించుకోవడానికి, పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోబోమని, ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి వస్తామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా బీజేపీతో పొత్తు ఉంటుందనే ప్రచారాన్ని ఆయన పూర్తిగా కొట్టిపారేశారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని లోపాలను కేటీఆర్ బహిరంగంగానే అంగీకరించారు. క్షేత్రస్థాయి నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, క్యాడర్‌తో సరైన సమన్వయం లేకపోవడం వల్లే ఎన్నికల్లో దెబ్బతిన్నామని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ఉత్తర తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే వలస కార్మికుల కోసం సమగ్రమైన 'గల్ఫ్ పాలసీ'ని తీసుకురాలేకపోయామని ఆయన అంగీకరించారు. రాబోయే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో కేవలం 'గెలుపు గుర్రాలకే' ప్రాధాన్యత ఇస్తామని, అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని సంకేతాలిచ్చారు.

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతుబంధు, రుణమాఫీ వంటి పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైందని, ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ప్రాణహిత ప్రాజెక్టు, సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల విస్తరణపై ప్రభుత్వ వైఖరిని ఆయన తప్పుబట్టారు. పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని, నాయకులందరూ కేసీఆర్ నాయకత్వంలో ఐక్యంగా ఉన్నారని స్పష్టం చేశారు. మే, జూన్ నెలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టి, పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్నిర్మించనున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.

Next Story