మూసీ పరిధిలోని పేదలకు 10వేల డబుల్‌బెడ్రూం ఇళ్లు: కేటీఆర్
మూసీ నది ఒడ్డున ఉన్న పేదలకు 10వేల డబుల్‌బెడ్రూం ఇళ్లను ఇస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు.
By Srikanth Gundamalla Published on 17 Aug 2023 2:58 PM GMTమూసీ పరిధిలోని పేదలకు 10వేల డబుల్‌బెడ్రూం ఇళ్లు: కేటీఆర్
జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం నగర అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలపైనా ఎమ్మెల్యేలంతా ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
వరద నివారణ కోసం హైదరాబాద్‌లో చేపట్టిన ఎస్‌ఎన్‌డీపీ కార్యక్రమం మంచి ఫలితాలను ఇచ్చిందన్నారు ఎమ్మెల్యేలు. గతంలో కురిసిన భారీ వర్షాలకు కొన్ని ప్రాంతాలు జలమయం అయ్యాయి. కానీ.. ఈ ఏడాది భారీ వర్షాలు కురిసినా వరద ముప్పు నుంచి తప్పించుకున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఎన్‌డీపీ కార్యక్రమంతో పాటు మూసీ నదిని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వానికి అండగా ఉంటామని ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లలో 10వేలకు పైగా ఇళ్లను మూసీ నది ఒడ్డున దర్భర పరిస్థితుల్లో నివసిస్తున్న పేద ప్రజలకు అందించాలని నిర్ణయించారు. మూసీ పైన కబ్జాలను తొలగించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ను ఎమ్మెల్యేలంతా కోరారు.
వరద నివారణ కోసం చేస్తున్న కార్యక్రమాలకు ఎమ్మెల్యేలు మద్దతుగా ఉన్నందుకు మంత్రి కేటీఆర్ వారికి అభినందనలు తెలిపారు. అయితే.. మూసీ నది పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటోన్న పేదల ప్రజలను, అక్కడి ప్రమాదకరమై పరిస్థితుల నుంచి తప్పించి సురక్షిత ప్రాంతాలకు తరలించి డబుల్‌బెడ్రూం ఇళ్లను కేటాయిస్తుందని తెలిపారు. అత్యంత పేదరికం వల్ల మూసీ నది పక్కన వారు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని.. వారికి ప్రభుత్వం డబుల్‌బెడ్రూం ఇళ్లను కేటాయిస్తుందని తెలిపారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వడం వల్ల వారందరికీ గొప్ప ఉపశమనం, ఆత్మగౌరవం లభిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇక దీంతో పాటుగానే మూసీ నదిపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించి, మూసీని బలోపేతం చేస్తామని తెలిపారు. అన్ని అడ్డంకులు తొలగిన తర్వాత పనులకు శ్రీకారం చుట్టేందుకు మార్గం సుగమం అవుతుందని అన్నారు. కాగా.. మైసీ ప్రాజెక్టు అభివృద్ధి కోసం ప్రాథమిక ప్లాన్‌ను ప్రభుత్వం పూర్తి చేసిందని కేటీఆర్ అన్నారు. ఎస్‌ఎన్‌డీపీ రెండో దశ కార్యక్రమం పనులను త్వరలోనే మంజూరు చేస్తామని.. వాననీటి నిర్వహణ కార్యక్రమం హైదరాబాద్‌లో నిరంతరాయంగా కొనసాగుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. వచ్చే వారంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తుందని మంత్రి కేటీఆర్ చెప్పారు.