అధికారిక లాంఛనాలతో రేపు రోశయ్య అంత్యక్రియలు.. మూడు రోజులు సంతాప దినాలు
Konijeti Rosaiah last rites will held Tomorrow at Mahaprasthanam.తమిళనాడు మాజీ గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ
By తోట వంశీ కుమార్ Published on 4 Dec 2021 6:56 AM GMTతమిళనాడు మాజీ గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కొణిజేటి రోశయ్య శనివారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆస్పత్రి నుంచి ఆయన భౌతికకాయాన్ని అమీర్‌పేటలోని ఆయన నివాసానికి తరలించారు. ఆయన మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. కాగా.. రోశయ్య అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నాం హైదరాబాద్‌లోని మహాప్రస్తానంలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చేయాలని ఇప్పటికే రంగారెడ్డి, హైదరాబాద్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇక ఆయన భౌతిక కాయాన్ని ఆదివారం ఉదయం గాంధీభవన్ కు తరలించనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ వెల్లడించారు. ప్రజల సందర్శనార్థం మధ్యాహ్నం వరకు అక్కడే ఉంచనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 12.30 తర్వాత గాంధీభవన్ నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుందని వెల్లడించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
1933 జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో రోశయ్య జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. 1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణ, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు, 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ, 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణ, విద్యుత్తు శాఖలు, 1991లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు, 1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలకు మంత్రిగా పనిచేసారు. 2004, 2009లో వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ (ఆర్ధిక ప్రణాళిక)ను ఇప్పటికి 15 సార్లు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. 1995-97 మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపిసిసి) అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు.