తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. ఇవాళో, రేపో ఆయన కషాయ కండువా కప్పుకోవడానికి రెడీ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు పార్టీ మారుతున్న విషయాన్ని తన అనుచరులకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.
అయితే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిన్నారెడ్డికి నష్టం జరగకుండా ఉండాలనే ఇంతకాలం పార్టీ మారలేదని.. ఎన్నికల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొండా స్పష్టం చేశారు. ఇదిలావుంటే.. 2014లో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందిన ఆయన.. 2018లో ఆ పార్టీకి రాజీనామా చేసి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా చేవెళ్ల నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు.
తర్వాత ఆయన కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా ఉంటూనే కొంత కాలం వేచి చూసి ఇప్పుడు కమలం గూటికి చేరబోతున్నారని తెలుస్తోంది. విద్యావంతుడుగా పేరున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరుతుండడం ఆ పార్టీ తెలంగాణ నేతల్లో కొత్త ఉత్సాహాన్నిస్తోంది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాక తెలంగాణ బీజేపీకి కచ్చింతంగా బలాన్నిస్తుందని బీజేపీ నేతలు, కార్యకర్తలు గట్టి నమ్మకంతో ఉన్నారు.