ఎక్స్‌గ్రేషియా పెంచే ఫైల్‌పై మంత్రి కొండా సురేఖ తొలి సంతకం
కొండా సురేఖ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
By Srikanth Gundamalla Published on 17 Dec 2023 10:57 AM GMTఎక్స్‌గ్రేషియా పెంచే ఫైల్‌పై మంత్రి కొండా సురేఖ తొలి సంతకం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. తాజాగా కొండా సురేఖ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలోనే వన్యప్రాణుల దాడుల్లో చనిపోయిన వారి కుటుబాలకు ఎక్స్‌గ్రేషియా పెంచే ఫైల్‌పై మంత్రి కొండా సురేఖ తొలి సంతకం చేశారు. ప్రస్తుతం ఉన్న రూ.5 లక్షల పరిహారాన్ని రూ. 10 లక్షలకు పెంచుతూ మంత్రి కొండా సురేఖ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సంబంధిత ఫైల్‌పై తొలి సంతకం చేశారు. అంతేకాదు.. వివిధ కార్యక్రమాలు, ఉత్సవాలకు ఏనుగులను ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకునేందుకు అనుమతిని ఇస్తూ మరో ఫైల్‌పైనా సంతకం చేశారు.
పండితులు, మంత్రోచ్ఛరణల మధ్య అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత అటవీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. హరితహారం ద్వారా ఇప్పటి వరకు జరిగిన పచ్చదనం పెంపు, వచ్చే ఏడాది లక్ష్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే అటవీ, దేవాదాయ శాఖల్లో ప్రస్తుత సిబ్బంది, కొత్తగా నియామకాలకు ఉన్న అవకాశాలను పరిశీలించారు కొండా సురేఖ. సంబంధిత శాఖల కోసం తానెప్పుడు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ తెలిపారు. అలాగే సిబ్బంది, అధికారులు నిజాయితీగా పనిచేయాలని సూచించారు. సమిష్టికి పనిచేసి ఉన్నత విజయాలను అందుకుందామని.. పర్యావరణాన్ని కాపాడుతూ.. పచ్చదనం పెంచుకుందామని మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు.
ఇక త్వరలోనే శాఖ వారీగా పూర్తిస్థాయి సమీక్షా సమావేశాలు చేపడతానని మంత్రి కొండా సురేఖ అధికారులకు తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో తయారు చేసిన పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు. ఆయా శాఖ మంత్రిగా కొండా సురేఖ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి కొండా సురేఖకు శుభాకాంక్షలు తెలిపారు.