ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ నేత, లోక్ సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి అంటే జగన్ మాదిరి ఉండాలని మంచి కితాబును ఇచ్చారు. వెయ్యి రూపాయలు దాటే అన్ని వైద్యాలను ఆరోగ్యశ్రీలో జగన్ చేర్చారని.. కరోనా చికిత్సను కూడా ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొచ్చారని ప్రశంసించారు.
తెలంగాణలో కరోనా బారిన పడిన ఎందరో పేషెంట్లు ప్రైవేటు ఆసుపత్రుకు లక్షలు చెల్లిస్తున్నారని... కరోనాను ఆరోగ్యశ్రీ కిందకు తెలంగాణ ప్రభుత్వ ఎందుకు తీసుకురాలేదని కోమటిరెడ్డి ప్రశ్నించారు. నకిరేకల్ మున్సిపాలిటీలో ప్రచారం నిర్వహిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ముఖ్యమంత్రి అంటే వైఎస్ జగనే అన్నారు.. ఆంధ్రప్రదేశ్‌లో వెయ్యి రూపాయలు దాటిన వైద్యం అంతా ఆరోగ్య శ్రీలోకి వచ్చేలా జగన్ తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయం అని చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ బారినపడి ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో లక్షలు తగలేస్తున్నారని.. మరి తెలంగాణలో కరోనా ట్రీట్‌మెంట్‌ను ఎందుకు ఆరోగ్య శ్రీ పరిధిలోకి తేవడం లేదంటూ సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు కోమటిరెడ్డి. ఓటు వేసే ముందు... నీ కొడుక్కి ఉద్యోగం వచ్చిందా..? మీకు ఇళ్లు వచ్చాయా? లేదా? అనేది ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆసుపత్రుల్లో కరోనా చికిత్స కోసం లక్షల్లో ఖర్చు చేస్తూ ఉండడాన్ని చూపిస్తూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా జగన్ పై ప్రశంసలు కురిపించారు.