ఏదో ఒకరోజు సీఎం అవుతా.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన కామెంట్స్
నల్లగొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Srikanth Gundamalla Published on 7 Nov 2023 4:15 PM ISTఏదో ఒకరోజు సీఎం అవుతా.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన కామెంట్స్
నల్లగొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం అయ్యే రోజు వస్తుందని, ఏదో ఒక రోజు సీఎం అవుతానని ఆయన వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడే సీఎం కావాలనే తొందర లేదన్నారు. నల్లగొండ ఆర్డీవో కార్యాలయంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అనుచరులు, కార్యకర్తలతో భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ అధికారులకు సమర్పించారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
ఏపీలో నష్టం జరుగుతుందని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. నల్గొండలో కనిపిస్తున్న అభివృద్ధి తాను చేసినదేనని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ కట్టిన నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్ట్‌లు 70 ఏళ్లు గడుస్తున్నా చెక్కు చెదరలేదని.. కానీ కేసీఆర్ కట్టిన కాళేశ్వరంలో ఓ బ్యారేజ్ కూలిపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ అవినీతి పాల్పడిందనడానికి ఇదే నిదర్శనం అని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ కుటుంబ సభ్యలుంతా లాభపడ్డారని.. ఆ ప్రాజెక్టును ఏటీఎంలా వినియోగించుకున్నారంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు.
అయితే.. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీనే అని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన లక్ష్యం నెరవేరలేదని.. ఆత్మహత్యల కోసం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకోలేదన్నారు. ఉద్యోగాల భర్తీలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని.. పోలింగ్ చివరి రోజు రైతుబంధు డబ్బులు వేస్తారని మోసపోవద్దని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూచించారు. డిసెంబర్ 9 మనకు లక్కీ నెంబర్ అని.. ఆ రోజు సోనియా పుట్టినరోజని, ఆ రోజే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.