సీఎం కేసీఆర్ పుట్టిన రోజు.. కొడిమ్యాల అట‌వీ ప్రాంతాన్ని ద‌త్త‌త తీసుకున్న ఎంపీ సంతోష్ కుమార్‌

Kodimial forest area was adopted by MP Santhosh kumar.కేసీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా వెయ్యి ఎక‌రాల అభ‌యార‌ణ్యాన్ని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Feb 2023 2:27 PM IST
సీఎం కేసీఆర్ పుట్టిన రోజు..  కొడిమ్యాల అట‌వీ ప్రాంతాన్ని ద‌త్త‌త తీసుకున్న ఎంపీ సంతోష్ కుమార్‌

ఫిబ్ర‌వ‌రి 17 సీఎం కేసీఆర్ పుట్టిన రోజు అన్న సంగ‌తి తెలిసిందే. ముఖ్య‌మంత్రి పుట్టిన రోజు సంద‌ర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టేందుకు భార‌త్ రాష్ట్ర స‌మితి(బీఆర్ఎస్‌) శ్రేణులు ముమ్మ‌ర ఏర్పాట్లు చేస్తుండ‌గా ఆయ‌న‌కు న‌మ్మిన‌ బంటు అయిన ఎంపీ సంతోష్ కుమార్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

కేసీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా వెయ్యి ఎక‌రాల అభ‌యార‌ణ్యాన్ని ద‌త్త‌త తీసుకుంటున్న‌ట్లు ఎంపీ సంతోష్‌కుమార్ ప్ర‌క‌టించారు. ఆంజనేయ భక్తులకు బాసటగా కొండగట్టు ఆలయాన్ని ఆనుకుని ఉండే వెయ్యి ఎకరాల అభయారణ్యాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున దత్తత తీసుకున్నారు.

శ్రీరాముడికి నమ్మిన బంటు ఆంజనేయస్వామి, అలాంటి ఆంజనేయుడు స్వయంభుగా వెలసిన ప్రాంతం జగిత్యాల జిల్లా కొండగట్టు. సహజమైన కొండలు, గుట్టల మధ్య వెలసిన కొండగట్టును దేశంలోనే ప్రముఖ ఆంజనేయ స్వామి దేవాలయంగా పునర్ నిర్మించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే సంతోష్ కుమార్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన కేసీఆర్‌.. స్వరాష్ట్రం సిద్దించాక గత ఎనిమిదేళ్లుగా తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్నారని, ఆయన తపనను అతి దగ్గరి నుంచి చూసిన వ్యక్తిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆంజనేయుడి ప్రధాన లక్షణాలైన పరాక్రమం, విశ్వాసం కేసీయార్ సొంతమని, అభివృద్ది నిర్ణయాల్లో పరాక్రమం, తెలంగాణ పట్ల ఆయన విశ్వాసం వెలకట్టలేనివన్నారు.

అన్ని రంగాల్లో అభివృద్దితో పాటు హరిత, ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లే తెలంగాణను సీఎం కాంక్షిస్తున్నారని, కాళేశ్వరం కట్టినా, యాదాద్రి పునర్ నిర్మాణం చేసినా, ఇప్పుడు కోటి మొక్కుల దేవుడు కొండగట్టు అంజన్న ఆలయం అభివృద్ది నిర్ణయమైనా కేసీయార్ దార్శనికతకు నిదర్శనమన్నారు.

చంద్రుడికో నూలు పోగు లాగా ఆయన వెన్నంటి, మద్దతుగా నిలవటం తనకు లభించిన వరంగా భావిస్తూ.. ముఖ్యమంత్రి పుట్టిన రోజు పురస్కరించుకుని అంజన్న సన్నిధి వెన్నంటి ఉండే వెయ్యి ఎకరాలకు పైగా అభయారణ్యాన్ని దత్తత తీసుకుంటున్న‌ట్లు తెలిపారు.

కొడిమ్యాల రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వచ్చే కంపార్టెమెంట్ 684లో 752 ఎకరాలు, 685లో 342 ఎకరాలు మొత్తం 1,094 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకుంటారు. మొదటి విడతగా కోటి రూపాయల వ్యయంతో ఈ వెయ్యి ఎకరాల అటవీ భూమికి మరింత పచ్చందాలు అద్దుతామని అన్నారు. దశల వారీగా మిగతా నిధులు కూడా అందించి లక్షిత పనులు పూర్తి చేస్తామ‌ని చెప్పారు.

చిన్నతనం నుంచే కేసీఆర్‌ వెంట ఉన్న తనకు కొండగట్టుతో బలమైన అనుబంధం ఉన్నదని, అనేక సార్లు ఆంజనేయుడిని దర్శించుకుని ఈ అటవీ ప్రాంతంలో సేదతీరిన అనుభూతులు ఉన్నాయన్నారు.

ఐదు వందల ఏళ్లకు ముందే అస్థిత్వంలోకి వచ్చిన కొండగట్టు ఆలయంలో ఈ అడవిలో లభించే సుగంధ మొక్కలు, చందనం చెట్ల నుంచే పూజలు జరిగేవని ప్రతీతి. మళ్లీ ఆ వైభవం కోసం ఈ అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఔషధ మొక్కలు, సుగంధ మొక్కలు నాటుతామన్నారు.

అటవీశాఖ అధ్వర్యంలో అటవీ భూమి సరిహద్దుకు రక్షణ చర్యలతో పాటు, అడవి లోపల పునరుజ్జీవన చర్యలు చేపడతామన్నారు. సహజ అడవి పునరుద్దరణకు చెక్ డ్యామ్ ల నిర్మాణంతో పాటు, నేలలో తేమ పరిరక్షణ చర్యలు చేపడతామన్నారు. ఆలయ పరిసరాల్లో పెద్ద ఎత్తున సంచరించే కోతులను అటవీ ప్రాంతానికి పరిమితం చేసేలా పెద్ద ఎత్తున పండ్ల మొక్కలు నాటి మంకీ ఫుడ్ కోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులు, పచ్చని ప్రకృతి మధ్య కాసేపు సేద తీరేలా పరిసరాలను తీర్చిదిద్దుతాని, మట్టితో వాకింగ్ ట్రాక్ తో పాటు, పగోడాలను ఏర్పాటు చేస్తామన్నారు.

ఏ లక్ష్యంతోనైతే ముఖ్యమంత్రి కొండగట్టు పునర్ నిర్మాణం చేపడుతున్నారో, దానికి మద్దతుగా తమ వంతు ప్రయత్నం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున ఉంటుందని సంతోష్ కుమార్ ప్రకటించారు.

Next Story