తెలంగాణలో మేం అనుకున్న ఫలితాలు రాలేదు: కిషన్‌రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాలను గెలిచిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది.

By Srikanth Gundamalla  Published on  4 Dec 2023 12:00 PM GMT
kishan reddy, comments,  telangana results, bjp,

తెలంగాణలో మేం అనుకున్న ఫలితాలు రాలేదు: కిషన్‌రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాలను గెలిచిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. అయితే.. ఎన్నికల ఫలితాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తాజాగా స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తాము అనుకున్న విధంగా లేవని చెప్పారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కిషన్‌రెడ్డి ఈ కామెంట్స్ చేశారు.

అయితే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొరపాటు ఎక్కడ జరిగిందనే దానిపై జాతీయ నాయకత్వంతో సమీక్షించి లోపాలు సరిదిద్దుకుంటామని కిషన్‌రెడ్డి చెప్పారు. లోపాలను సరి చేసుకుని త్వరలో రాబోయే లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం అవుతామన్నారు. బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల కంటే ఈ సారి బీజేపీకి ఓటింగ్‌ శాతం బాగా పెరిగిందని కిషన్‌రెడ్డి తెలిపారు. ఇది కంటిన్యూ చేసి మరిన్ని ఎక్కువ స్థానాలను గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. కాంగ్రెస్‌ నుంచి ఎవరు సీఎం అవుతారో తెలియని విచిత్ర పరిస్థితి నెలకొందని కామెంట్ చేశారు కిషన్‌రెడ్డి.

అలాగే.. కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి పార్తీ సత్తా చాటారని గొప్పగా చెప్పారు. అక్కడ పోటీ చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ను ఓడించిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. దేశ రాజకీయాల్లో ఇదో చరిత్ర అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డికి అభినందనలు తెలిపారు. అలాగే రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఘన విజయం సాధించిందని అన్నారు. దాంతో.. మోదీపై దేశ ప్రజల్లో ఎంత నమ్మకం ఉందో మరోసారి నిరూపితం అయ్యిందని చెప్పారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని మరోసారి తీసుకొస్తామని కిషన్‌రెడ్డి దీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌ నాయకులు తమపై తప్పుడు ప్రచారాలు చేశారనీ.. ఈరోజు వారు ఫామ్‌హౌస్‌కు పరిమితం కావాల్సి వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లు కిషన్‌రెడ్డి చెప్పారు. తమ పోరాటం వల్ల కాంగ్రెస్‌కు లాభం జరిగిందన్నారు. అయితే.. ఇక ముందు కూడా ప్రజల కోసం పోరాడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చెప్పారు.

Next Story