లోక్‌సభ ఎన్నికలపై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది.
By Srikanth Gundamalla Published on 15 Dec 2023 4:41 PM ISTలోక్‌సభ ఎన్నికలపై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. అయితే.. బీజేపీకి మాత్రం గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. ఒకరు నుంచి 8 మంది ఎమ్మెల్యేలకు పెరిగారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇంచార్జ్‌లు, లోక్‌సభ నియోకవర్గాల ఇంచార్జ్‌లతో కిషన్‌రెడ్డి సమావేవం అయ్యారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డిసెంబర్ చివరి వారంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు రానున్నారని కిషన్‌రెడ్డి చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెల్లే అంశాలపై నేతలకు దిశా నిర్దేశం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీ.. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఎలాంటి పొత్తులు ఉండవు అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌తో బీజేపీ పోరాటం చేస్తుందని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తామని చెప్పారు. తెలంగాణలో రాజకీయంగా బీజేపీకి మంచి అవకాశాలు ఉన్నాయని అన్నారు కిషన్‌రెడ్డి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్నన్ని సీట్లు సాధించలేకపోయినా.. ఓటింగ్ శాతం పెరిగిందని అన్నారు. సర్వేలకు సైతం అందని విధంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయని కిషన్‌రెడ్డి చెప్పారు. ఇక శనివారం నుంచి తెలంగాణలో వికసిత్ భారత్ కార్యక్రమంపై ప్రచారం మొదలుపెట్టాలని నేతలు, కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తారని అన్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి దీమాగా చెప్పారు.