బీఆర్ఎస్‌కు ఎమ్మెల్యే రేఖానాయక్ రాజీనామా..నెక్ట్స్ ఏంటి?
బీఆర్ఎస్‌కు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ రాజీనామా చేశారు.
By Srikanth Gundamalla Published on 6 Oct 2023 11:01 AM GMTబీఆర్ఎస్‌కు ఎమ్మెల్యే రేఖానాయక్ రాజీనామా..నెక్ట్స్ ఏంటి?
బీఆర్ఎస్‌కు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ రాజీనామా చేశారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. జాబితాలో మరోసారి రేఖానాయక్‌కు కేసీఆర్ అవకాశం కల్పించలేదు. దాంతో.. పార్టీ అధిష్టానంపై ఎమ్మెల్యే రేఖానాయక్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీ మారుతానని.. లేదంటే ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేస్తానని ముందే చెప్పారు. తాజాగా ఆమె బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికార పార్టీ బీఆర్ఎస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
బీఆర్ఎస్‌లో మహిళలకు గౌరవం లేదని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. అందుకే పార్టీని వీడుతున్నట్లు చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానన్న ఆమె.. ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతానన్న విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తానన్నారు. అయితే.. ఖానాపూర్‌లో ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్‌ను మంత్రి కేటీఆర్ ఫ్రెండ్ అని ఇక్కడ టికెట్ ఇచ్చారని విమర్శించారు. తాను ఏ తప్పు చేశానని టికెట్ ఇచ్చేందుకు నిరకారించారో చెప్పాలని నిలదీశారు. ఖానాపూర్ ఎమ్మెల్యేగా నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడ్డానని చెప్పుకొచ్చారు రేఖానాయక్. మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే పరిష్కరించలేదు అని అన్నారు. మీడియా ముందే ఎమ్మెల్యే రేఖానాయక్ కన్నీళ్లు పెట్టుకున్నారు.
బీఆర్ఎస్ టికెట్ దక్కించుకున్న జాన్సన్ నాయక్ తనను బెదిరించారని ఆరోపణలు చేశారు. ఎలా గెలుస్తావో చూస్తానని అన్నారని చెప్పారు రేఖానాయక్. జాన్సన్ నాయక్ తెలంగాణ ఉద్యమం సమయంలో ఎక్కడున్నావ్ అని ప్రశ్నించారు. దమ్ముంటే మంత్రి పదవి తీసుకుని ఉండాల్సిందని చెప్పారు. అయితే.. ఇన్నాళ్లు కేటీఆర్ తన స్నేహితుడి కోసమే ఖానాపూర్‌ను అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. మహిళలకు బీఆర్ఎస్‌లో చోటు లేదు అని.. అందుకే బీఆర్ఎస్‌లో తాను ఇక ఉండబోనని అన్నారు. అయితే.. ఏ పార్టీలో చేరతారు అనేది మాత్రం రేఖానాయక్ వెల్లడించలేదు. కాగా.. ఆమె భర్త శ్యామ్ నాయక్ ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. ఈ నేపథ్యంలో ఆమె కూడా కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. మరి రేఖానాయక్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.