అమెరికాలో కాల్చి చంపబడ్డ ఖమ్మం యువకుడు
Khammam youngster shot dead in the US. అమెరికాలోని అలబామా రాష్ట్రంలోని మాంట్‌గోమెరీ నగరంలో మహంఖానీ
By అంజి
అమెరికాలోని అలబామా రాష్ట్రంలోని మాంట్‌గోమెరీ నగరంలో మహంఖానీ అఖిల్ సాయి (25) అనే యువకుడు కాల్చి చంపబడ్డాడు. ఖమ్మం జిల్లాలోని మధిర పట్టణానికి చెందిన అఖిల్ సాయి ఆదివారం రాత్రి కాల్చి చంపబడ్డాడు. అతను మాంట్‌గోమెరీలోని ఆబర్న్ యూనివర్సిటీలో ఎంఎస్ కోర్సు చేయడానికి గతేడాది డిసెంబర్‌లో అమెరికా వెళ్లాడు. అతడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉన్న ఓ పెట్రోల్ బంకులో పార్ట్‌టైమ్ ఉద్యోగం కూడా చేస్తున్నాడు.
ఫిల్లింగ్ స్టేషన్‌లోని భద్రతా సిబ్బంది తుపాకీ మిస్ ఫైర్ కావడంతో అఖిల్ సాయి తలకు బుల్లెట్ గాయమైందని చెబుతున్నారు. అతన్ని ఆసుపత్రికి తరలించగా, అతను చనిపోయినట్లు తెలిపారు. ఈ ఘటనపై అమెరికా అధికారులు వ్యాపారి అయిన అతని తండ్రి ఎం ఉమాశంకర్‌కు సమాచారం అందించారు. ఉమాశంకర్, ఆయన భార్య మాధవి మధిరలో మీడియాతో మాట్లాడుతూ.. తమ కుమారుడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా తమకు అప్పగించేలా చూడాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
చేతికొచ్చిన కొడుకు చనిపోయాడన్న వార్త తెలిసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. అఖిల్ సాయి మృతికి సంబంధించి రవితేజ గోలీ అనే యువకుడిని సంఘటన స్థలంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా అఖిల్ సాయిది హత్యానా? లేకా మిస్ ఫైర్ అనేది తెలియాల్సి ఉంది.