అమెరికాలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం విద్యార్థి మృతి

కొద్దిరోజుల క్రితం పబ్లిక్ జిమ్‌లో ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతూ 24 ఏళ్ల పుచ్చా వరుణ్ రాజ్ బుధవారం మరణించాడు.

By అంజి  Published on  8 Nov 2023 11:31 AM IST
Khammam student, US gym, Pucha Varun Raj, United States

అమెరికాలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం విద్యార్థి మృతి

హైదరాబాద్: కొద్దిరోజుల క్రితం పబ్లిక్ జిమ్‌లో ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతూ 24 ఏళ్ల పుచ్చా వరుణ్ రాజ్ బుధవారం మరణించాడు. పది రోజులుగా తీవ్ర గాయాలతో లూథరన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వరుణ్‌.. పరిస్థితి విషమించడంతో తాజాగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో వరుణ్‌ ఇంటి విషాద ఛాయలు అలుముకున్నాయి. వరుణ్ రాజ్ కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చదవడం కోసం 2022 ఆగస్టులో అమెరికా వెళ్లిపోయాడు. అతని స్వస్థలం ఖమ్మం జిల్లాలోని మామిల్లిగూడెం. ఇండియానా రాష్ట్రంలో ఎంఎస్‌ చదువుతున్న వరుణ్‌ రోజూలాగే అక్టోబర్‌ 31న జిమ్‌కు వెళ్లాడు.

తిరిగి ఇంటికి వెళ్తుండ‌గా ఓ దుండ‌గుడు క‌త్తితో పొడిచాడు. స్థానికుల సమాచారం మేరకు ఘ‌ట‌నాస్థలానికి చేరుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి త‌ర‌లించారు. తీవ్రమైన నరాల బలహీనత ఏర్పడి ఎడమవైపు పాక్షిక వైకల్యం బారినపడే ఛాన్స్‌ ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ క్రమంలో వరుణ్‌కు లైఫ్‌సపోర్ట్‌తో వైద్యులు చికిత్స చేశారు. అయితే, పరిస్థితి విషమించడంతో తాజాగా ప్రాణాలు కోల్పోయాడు. వరుణ్‌ తండ్రి రామ్మూర్తి మహబూబాబాద్‌ జిల్లాలో ఉపధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఈ కేసులో నిందితుడు ఆండ్రేడ్‌ జోర్డాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వరుణ్ రాజ్‌ మృతిపై వాల్పరైసో విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్ జోస్ పాడిల్లా సంతాపం ప్రకటించారు.

Next Story