Khammam: కుక్కను తప్పించబోయి చెట్టును ఢీకొట్టిన కారు, ఇద్దరు పిల్లలు సహా తల్లి మృతి
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 29 May 2024 10:31 AM ISTKhammam: కుక్కను తప్పించబోయి చెట్టును ఢీకొట్టిన కారు, ఇద్దరు పిల్లలు సహా తల్లి మృతి
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హర్యాతండా దగ్గర రోడ్డుపై కారు వేగంగా వెళ్తున్న సమయంలో అనూహ్యంగా రోడ్డుపై ఒక కుక్క వచ్చింది. ఈ క్రమంలో కుక్కను తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. దాంతో.. ఒక్కసారిగా అదుపుతప్పిన కారు బోల్తా పడింది. ఆ తర్వాత రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. దాంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో కారులో ఉన్న ఇద్దరు చిన్నారులతో పాటు వారి తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఇక కారు నడుపుతున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ ప్రవీణ్ కుమార్‌ను ఆస్పత్రికి తరలించారు. కాగా.. బాబోజీ తండాకు చెందిన డాక్టర్ బోడ ప్రవీణ్ కుమార్ కుటుంబం హైదరాబాద్‌కు కారులో పయనం కాగా.. దారి మధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కుక్క అడ్డురావడంతో దానిని తప్పించే క్రమంలో కారు చెట్టును ఢీకొట్టింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. కారులో ఉన్న మృతదేహాలను బయటకు తీశారు. గాయాలపాలైన ప్రవీణ్ కుమార్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతదేహాలను 108 అంబులెన్స్‌లో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.
కాగా.. ఈ రోడ్డు ప్రమాదంపై రఘునాథపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సంఘటనపై మృతుల బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవనీ.. ప్రవీణ్ కుమార్ వారిని చంపి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఖమ్మం ఆస్పత్రి వద్ద ఆందోళన కూడా చేశారు. కాగా.. దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో నిరసనకారులు వెనక్కి తగ్గారు.