Khammam: ఎనిమిది మంది కూలీలపై పడిన పిడుగు
ఖమ్మం జిల్లాలో ఒకేసారి 8 మంది వ్యవసాయ కూలీలు పిడుగుపాటుకు గురయ్యారు.
By Srikanth Gundamalla Published on 26 Sept 2023 5:31 PM ISTKhammam: ఎనిమిది మంది కూలీలపై పడిన పిడుగు
ఉరుములు, మెరుపులతో వర్షాలు పడినప్పుడు అక్కడక్కడ పిడుగుపాటు ఘటనలు చోటుచేసుకుంటాయి. అయితే.. అలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి. చెట్ల కింద అస్సలు ఉండొద్దని నిపుణులు చెప్తూనే ఉన్నారు. ఈ విషయం తెలియని కొందరు చెట్ల కింద నిలబడి పిడుగుపాటుకు గురవుతున్నారు. కొన్ని సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన వారు ఉంటే.. మరికొన్ని సంఘటనల్లో తీవ్ర గాయాలు అయిన వారు ఉన్నారు. అయితే.. తాజాగా ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో కూడా పిడుగుపడింది. ఈ ఘటనలో ఏకంగా 8 మంది ఒకేసారి పిడుగుపాటుకి గురయ్యారు.
ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపల్లి మండలం దమ్మాయిగూడెంలో చోటుచేసుకుంది. ఎనిమిది మంది వ్యవసాయ కూలీలు అదే గ్రామానికి చెందిన మద్ది వీరయ్యకు చెందిన మిర్చి, పత్తి చేనులో చెత్తను తొలగించేందుకు వెళ్లారు. ఉదయం నుంచి పనులను ప్రారంభించారు. అయితే.. ఉన్నట్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. దాంతో.. వర్షం నుంచి తలదాచుకునేందుకు 8 మంది వ్యవసాయ కూలీలంతా వెళ్లి అక్కడే ఉన్న ఒక వేప చెట్టు కింద నిలబడ్డారు. అదే వారు చేసిన తప్పుగా మిగిలిపోయింది. పెద్ద శబ్ధంతో పిడుగు వ్యవసాయకూలీలు నిలబడ్డ చెట్టుపైనే పడిపోయింది.
దాంతో.. చెట్టుకింద ఎనిమిది మంది వ్యవసాయ కూలీలు పిడుగుపాటుకి గురయ్యారు. ఇద్దరికి తీవ్రగాయాలు కాగా.. మిగతావారికి స్వల్పగాయాలు అయ్యాయి.త తీవ్రంగా గాయపడ్డవారిని వెంటనే ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది. తీవ్రగాయాలపాలైన వారి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే.. పిడుగులు పడుతున్న సందర్భంలో చెట్ల కింద కానీ.. బహిరంగ ప్రదేశాల్లో కానీ ఉండొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.