తాను కూడా రైతునేనని, వారి కష్టాలు తెలుసని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మరో కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో కలిసి ఆయన పర్యటించారు. ఖమ్మం, పాలేరు, మధిర ప్రాంతాల్లో కేంద్రమంత్రులు ఏరియల్ సర్వే చేశారు. వరదల కారణంగా పంటలు దెబ్బతిన్నాయని, గతంలో ఇలాంటి పరిస్థితులు చూడలేదన్నారు. కేంద్రం తరఫున బాధితులకు అండగా ఉంటామన్నారు. గత ప్రభుత్వం కేంద్రం నిధులను పక్కదారి పట్టించిందన్నారు. ఈసారి అలా జరగకుండా చూస్తామని శివరాజ్ సింగ్ పేర్కొన్నారు.
అంతకుముందు వరదలకు కొట్టుకుపోయిన సాగర్ ఎడమ కాలువను కేంద్రమంత్రులు పరిశీలించారు. మధిరలో కట్టలేరు వరదతో ముంపునకు గురైన పొలాలను, ఖమ్మంలో మున్నేరు వాగు ఉద్ధృతితో ముంపునకు గురైన ప్రాంతాలను కేంద్రమంత్రులు పరిశీలించారు. ఏరియల్ సర్వే తర్వాత పాలేరుకు కేంద్రమంత్రులు వెళ్లారు. రాష్ట్రంలో వరద పరిస్థితులపై చిత్ర ప్రదర్శనను కేంద్రమంత్రులు తిలకించారు. పంట నష్టపోయిన రైతులతో కేంద్రమంత్రులు మాట్లాడారు. కేంద్రమంత్రుల వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు.