ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ భారీస్థాయిలో జనగర్జన సభ నిర్వహిస్తోంది. అయితే.. ఈ సభకు ప్రజలు రాకుండా ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు చేశారని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. పోలీసుల ద్వారా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అడ్డుకున్నారని అన్నారు. కాంగ్రెస్ నేతల ఆరోపణలపై ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ స్పందించారు. జనగర్జన సభకు తాము ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదని.. తప్పుడు ప్రచారాలు చేయొద్దని కోరారు సీపీ విష్ణు ఎస్ వారియర్.ట్రాఫిక్ డైవెర్షన్ మినహా తాము ఎక్కడా చెక్ పోస్టులు కూడా పెట్టలేదని అన్నారు. సోషల్ మీడియాలో వస్తోన్న ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పారు ఖమ్మం పోలీస్ కమిషనర్.
కానీ.. చాలా వరకు వాహనాలను అడ్డుకున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా ఇదే విషయంపై డీజీపీతో ఫోన్లో మాట్లాడారు. అడ్డుకునే ఘటనలు జరగనివ్వమని రేవంత్‌రెడ్డికి డీజీపీ హామీ ఇచ్చారు. ఇక భద్రాచలంలో ఖమ్మం సభ కోసం సిద్ధంగా ఉన్న ఆటోలను కామేపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు పోలీసులు. మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేశారు.