ఆపరేషన్ తర్వాత కేసీఆర్‌ను నడిపించిన వైద్యులు (వీడియో)

కాలుకి సర్జరీ తర్వాత కేసీఆర్‌ కోలుకుంటున్నారు. ప్రస్తుతం యశోద ఆస్పత్రి వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు.

By Srikanth Gundamalla  Published on  9 Dec 2023 8:45 AM GMT
kcr, slowly walking, leg surgery ,

ఆపరేషన్ తర్వాత కేసీఆర్‌ను నడిపించిన వైద్యులు (వీడియో)

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ తన ఫామ్‌హౌజ్‌లో అనుకోకుండా కిందపడి గాయపడ్డారు. ఆ తర్వాత కేసీఆర్‌ను కుటుంబ సభ్యులు సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. అన్ని స్కాన్లు, టెస్టులు నిర్వహించిన వైద్యులు.. కేసీఆర్‌ కాలు ఫ్యాక్చర్‌ అయ్యిందని సర్జరీ అవసరమని చెప్పారు. తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్సను శుక్రవారం సాయంత్రమే విజయవంతంగా నిర్వహించారు. ఆయన ప్రస్తుతం యశోద ఆస్పత్రి వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. కేసీఆర్‌ కోలుకునేందుకు ఎనిమిది వారాల వరకు సమయం పట్టనుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయడానికి కూడా రాలేకపోయారు.

కాలుకి సర్జరీ తర్వాత వైద్యులు కేసీఆర్‌ను తొలిసారిగా నడిపించారు. స్టాండ్‌ పట్టుకుని కేసీఆర్ నడుస్తుంటే.. ముందు వైద్య నిపుణులు సూచించారు. మరొకరు కేసీఆర్ చేతిని పట్టుకుని కిందపడిపోకుండా సపోర్ట్‌గా ఉన్నారు. కేసీఆర్‌ మెల్లిగా అతికష్టం మీద అడుగులు వేస్తూ ముందుకు నడుస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన బీఆర్ఎస్ శ్రేణులు, పార్టీ, కేసీఆర్ అభిమానులు గెట్‌వెల్ సూన్ సార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకుని ప్రజాసేవలోకి రావాలని పలువురు రాజకీయ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.

కాలుకి ఆపరేషన్ తర్వాత కేసీఆర్ ఆరోగ్యం బాగానే ఉందని యశోద ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం వేగంగానే మెరుగుపడుతోందని చెప్పారు. త్వరితగతిన కోలుకునేందుకు కేసీఆర్ శరీరం సహకరిస్తోందని వెల్లడించారు. మానసికంగా కూడా కేసీఆర్ ధృడంగా ఉన్నారని వైద్యులు అన్నారు. మరో రెండు మూడు రోజుల్లో కేసీఆర్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. అయితే.. ఇంటికెళ్లాక మాత్రం 6 నుంచి 8 వారాల వరకు రెస్ట్‌ తీసుకోవాల్సి ఉంటుందని యశోద ఆస్పత్రి వైద్యులు తెలిపారు.


Next Story