తెలంగాణ రాష్ట్రంలో సీఎం మార్పు ఉండబోతుందని జరుగుతున్న ప్రచారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత నిచ్చారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఇంకా పదేళ్లు తానే సీఎంగా ఉంటానని స్పష్టంచేశారు. మీడియాలో వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టి పారేశారు. సీఎం మార్పుపై ఇకపై ఎవరూ మాట్లాడొద్దని సూచించారు. ఆదివారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. కేటీఆర్‌ను సీఎం చేయబోతున్నారంటూ జరుగుతన్న ప్రచారాన్ని ఖండించారు. అసెంబ్లీ సాక్షిగా ఇంతకు ముందే చెప్పినా.. ఎందుకు మళ్లీ దాని గురించి మాట్లాడుతున్నారంటూ కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై నేతలు ఎవరూ కూడా దీనిపై మాట్లాడకూడదని తెలిపారు.
ఏప్రిల్‌లో టీఆర్‌ఎస్ భారీగా బహిరంగ సభ ఉంటుందని వెల్లడించారు. ఈ నెల 12 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభించాలని, మార్చి 1 నుంచి పార్టీ కమిటీల ఏర్పాటు ప్రారంభించాలని నేతలకు చెప్పారు. ఈ నెల 11న ఉదయం జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు తెలంగాణ భవన్‌కు రావాలని కేసీఆర్ ఆదేశించారు. ఇక తెరాసకు ఎవరూ పోటీకాదన్నారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలు, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్సే గెలవాలని కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు.