Telangana: మహిళలకు కేసీఆర్ సర్కార్ గుడ్‌న్యూస్
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
By అంజి Published on 4 Oct 2023 7:29 AM IST
Telangana: మహిళలకు కేసీఆర్ సర్కార్ గుడ్‌న్యూస్
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు ప్రభుత్వం 2017 నుంచి ప్రతి ఏటా చీరలను పంపిణీ చేస్తోన్న విషయం తెలిసిందే. కాగా ఈ సారి నేటి నుంచి 14వ తేదీ వరకు చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బతుకమ్మ చీరలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక కార్పొరేటర్లు పంపిణీ చేయనున్నారు. తెల్లరేషన్‌కార్డు ఉండి, 18 ఏండ్లు పూర్తయిన మహిళలకు వీటిని పంపిణీ చేయనున్నారు.
నేతన్నలకు ఉపాధి కల్పించడంతోపాటు ఆడబిడ్డలకు కానుకగా ప్రభుత్వం ప్రతి ఏటా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 14వ తేదీలోగా చీరల పంపిణీ పూర్తి కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పటికే 85 లక్షల చీరలను వివిధ జిల్లాలకు సరఫరా చేసినట్లు తెలిపారు. బతుకమ్మ చీరలను అర్హులైన ప్రతి మహిళకు అందజేయాలన్నారు. ఈ ఏడాది అందించే బతుకమ్మ చీరలను కొంగొత్త హంగులతో తయారు చేశారు. డాబీ, జాకార్డ్‌లలో 19 డిజైన్లు, 190 వెరైటీల్లో చీరలు తయారు చేశారు.
నేడు బతుకమ్మ చీరల పంపిణీకి జీహెచ్‌ఎంసీ యూసీడీ విభాగం ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 481 కేంద్రాల్లో 9,40,369 చీరలను ప్రజాప్రతినిధులు పంపిణీ చేయనున్నారు. గోడౌన్ల నుంచి ఆయా సర్కిళ్లలో పంపిణీ చేయనున్న ప్రాంతాలకు ఈ చీరలను తరలిస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్ నియోజక వర్గాలకు చెందిన 7,24,995 మంది ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలను బుధవారం నుంచి పంపిణీ చేయనున్నారు.