శుక్రవారం ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్!
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్‌లో ప్రమాదవశాత్తు జారి కిందపడి గాయపడ్డ విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 14 Dec 2023 11:54 AM ISTశుక్రవారం ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్!
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్‌లో ప్రమాదవశాత్తు జారి కిందపడి గాయపడ్డ విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత గురువారం ఈ సంఘటన జరగ్గా.. ప్రమాదంలో కేసీఆర్ తుంటి ఎముక విరిగింది. అయితే.. యశోద ఆస్పత్రి వైద్యులు వెంటనే శస్త్రచికిత్స కూడా చేశారు. కేసీఆర్ ఈ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి 8 వారాల వరకు సమయం పడుతుందని చెప్పారు. తుంటి ఎముకకు సర్జరీ తర్వాత కేసీఆర్‌ను మరుసటి రోజే నడిపించారు. ఆయన మెల్లిగా కష్టంమీద నడిచిన వీడియోను విడుదల చేశారు. ఏదీ ఏమైనా ఆయనకు సర్జరీ విజయవంతంగా పూర్తిచేశామని.. వేగంగా కోలుకుంటున్నట్లు యశోద ఆస్పత్రి వైద్యులు చెప్పారు.
కాగా.. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ శనివారం యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు కూడా వైద్యులు చేస్తున్నట్లు సమాచారం. వేగంగా కోలుకుంటున్న నేపథ్యంలో.. ఆయనకు బెడ్ రెస్ట్ అవసరమని భావిస్తున్న వైద్యులు డిశ్చార్జ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ శుక్రవారం వైద్యులు కేసీఆర్‌ను డిశ్చార్జ్ చేస్తే.. ఫామ్ హౌస్‌లోనే పూర్తిగా కోలుకునే వరకు రెస్ట్ తీసుకుంటారు.
కేసీఆర్ ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఆయన్ని పెద్ద ఎత్తున నాయకులు, సినీ ప్రముఖులతో పాటు ఇతరులూ పరామర్శించారు. బీఆర్ఎస్ నాయకులు ఆస్పత్రికి తిరిగారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కూడా స్వయంగా వెళ్లి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. మరోవైపు కేసీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన్ని ఎలాగైనా చూడాలని మూడ్రోజుల క్రితం పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు వెళ్లారు. దాంతో.. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకింది. చివరకు కేసీఆర్ స్పందించి.. దయచేసి ఎవరూ ఆస్పత్రికి రావొద్దని.. తాను పూర్తిగా కోలుకుని త్వరగా మీ ముందుకు వస్తానని విజ్ఞప్తి చేశారు. ఎక్కువ మంది తన కోసం రావడం వల్ల ఆస్పత్రిలో ఉన్న మిగతా పేషెంట్లు ఇబ్బందులు పడతారని చెప్పిన విషయం తెలిసిందే. కాగా.. వైద్యులు కేసీఆర్‌ను శుక్రవారం డిశ్చార్జ్ చేస్తే ఆయన్ని ఫామ్‌హౌస్‌లో నాయకులు పరామర్శించే అవకాశాలు ఉన్నాయి.