అలా చేస్తేనే కేసీఆర్, కేటీఆర్ సర్వేలో పాల్గొంటారు, ప్రభుత్వానికి తలసాని డిమాండ్

తెలంగాణలో కుల గణన రీ సర్వే చేయాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

By Knakam Karthik  Published on  12 Feb 2025 3:38 PM IST
Telangana, Caste Census, Brs, Congress, Thalasani

అలా చేస్తేనే కేసీఆర్, కేటీఆర్ సర్వేలో పాల్గొంటారు, ప్రభుత్వానికి తలసాని డిమాండ్

తెలంగాణలో కుల గణన రీ సర్వే చేయాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ప్రభుత్వం రీ సర్వే చేస్తే కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు సర్వేలో పాల్గొంటారని కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ మూవ్‌మెంట్ రాష్ట్రంలో బలంగా ఉందని, ప్రభుత్వం ఇచ్చిన కుల గణన నివేదికలో చాలా తప్పులు ఉన్నాయని ఆరోపించారు. కేసీఆర్ చేసిన సమగ్ర కుటంబ సర్వేలో బీసీలు 51 శాతం ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేలో బీసీల జనాభా ఎలా తగ్గిందని ప్రశ్నించారు. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు 90 శాతం మంది ఉన్నట్లు మాజీ మంత్రి తలసాని చెప్పారు.

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు అసెంబ్లీలో చట్టం చేసి 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తే బీసీలు ఒప్పుకోరని తలసాని చెప్పారు. పార్లమెంట్‌లో బిల్లు పెట్టి ప్రధాని మోడీ ఆమోదించాలని అన్నారు. జనాభా తక్కువ చేసి చూపిస్తే రాష్ట్రానికి తక్కువ నిధులే వస్తాయని, పునర్విభజన జరిగిగే అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు తెలంగాణకు తగ్గుతాయని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేశాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని తలసాని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని చెప్పారు. పార్టీ పరంగానూ, కలిసి వచ్చే రాజకీయ పార్టీలతోనూ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తలసాని వెల్లడించారు.

కాగా జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీపై 17వ తేదీ లోగా నిర్ణయం తీసుకుంటామని తలసాని పేర్కొన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ అవిశ్వాసంపై కేటీఆర్ ఆధ్వర్యంలో వచ్చే వారం సమావేశం ఉంటుందని, పరిస్థితులకు అనుగుణంగా మేయర్, డిప్యూటీ మేయర్ అవిశ్వాసంపై నిర్ణయం ఉంటుందని చెప్పారు. జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో కేసీఆర్, కేటీఆర్ సమావేశం నిర్వహిస్తారని తలసాని అన్నారు. నెంబర్ గేమ్‌ను బట్టి, మేయర్, డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాసం ఉంటుందని తెలిపారు.

Next Story