రేపు దామెరచర్లకు సీఎం కేసీఆర్..!
KCR inspects the work of Yadadri Thermal Power station tomorrow.యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను కేసీఆర్
By తోట వంశీ కుమార్ Published on 27 Nov 2022 5:09 AM GMTనల్లగొండ జిల్లా దామెరచర్ల వద్ద నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ సోమవారం పరిశీలించనున్నారు. ముఖ్యమంత్రి వస్తుండడంతో జెన్‌కో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్ వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉండడంతో ప్లాంటు ఆవరణలో రెండు హెలీప్యాడ్లు సిద్దం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం చేపట్టిన మూడో థర్మల్ విద్యుత్ కేంద్రం ఇది. 800 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో కొత్తగూడెంలో 48 నెలల్లో కొత్త ఫ్లాంటును నిర్మించి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. ఆ తరువాత 1080 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో భద్రాద్రి జిల్లా ఏడూళ్ల బయ్యారం వద్ద భద్రాద్రి పేరుతో మరో ఫ్లాంటును చేపట్టి ఉత్పత్తి ప్రారంభించారు. ఈ వరుసలో మూడో ఫ్లాంటును యాదాద్రి పేరుతో దామెరచర్ల వద్ద చేపట్టింది.
వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి ఫ్లాంటు నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. దేశంలో ప్రభుత్వ రంగంలో నిర్మిస్తున్న అతిపెద్ద థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఇది మొదటిది. ఒకే స్థలంలో 4వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు. రాష్ట్ర అవసరాలకు యాదాద్రి విద్యుత్ కేంద్రం కీలకమని, దీని నిర్మాణపనులను రాత్రింబవళ్లు పది వేల మంది కార్మికులు శరవేగంగా చేస్తున్నట్లు జెన్‌కో ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు.