తొలిసారి లోక్‌సభ ఎన్నికలకు దూరంగా కేసీఆర్ కుటుంబం
ఈసారి మాత్రం లోక్‌సభ పోటీలో కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఒక్కరు కూడా పోటీలో లేరు.
By Srikanth Gundamalla Published on 26 March 2024 11:15 AM ISTతొలిసారి లోక్‌సభ ఎన్నికలకు దూరంగా కేసీఆర్ కుటుంబం
లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు అన్ని పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసుకున్నాయి. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ కూడా పూర్తి అభ్యర్థుల లిస్ట్‌ను ప్రకటించింది. అయితే.. కేసీఆర్ కుటుంబం నుంచి ప్రతిసారి లోక్‌సభ ఎన్నికల్లో ఎవరో ఒకరు బరిలో ఉండేవారు. కాని.. ఈసారి మాత్రం పోటీలో కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఒక్కరు కూడా పోటీలో లేరు. 2004 నుంచి లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం పోటీ చేస్తుంది. కానీ.. తొలిసారి 2024 లోక్‌సభ ఎన్నికలకు వారు దూరంగా ఉన్నారు.
కాగా.. తెలంగాణ రాష్ట్ర సమితిని రాష్ట్ర సాధన కోసం 2001లో కేసీఆర్ స్థాపించారు. ఆ తర్వాత వచ్చిన 2004 ఎన్నికల్లో కరీంనగర్ లోక్‌సభ నుంచి పోటీ చేసి కేసీఆర్ గెలిచారు. అప్పుడే కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వంలో ఆయన కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత 2006, 2008 ఉపఎన్నికల్లో కూడా బరిలో నిలిచి విజయాన్ని అందుకున్నారు. 2009లో సార్వత్రిక ఎన్నికలు జరగ్గా మహబూబ్‌నగర్ లోక్‌సభ నుంచి కేసీఆర్ బరిలో నిలిచి మళ్లీ గెలిచారు. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయ్యింది. 2014లో టీఆర్ఎస్ తెలంగాణలో గవర్నమెంట్‌ను ఏర్పాటు చేసింది. కేసీఆర్ సీఎంగా కొనసాగారు. జమిలిగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ కూతురు కవిత పోటీ చేసి నిజామాబాద్ ఎంపీగా గెలిచారు.
ఇక ఆ తర్వాత 2018లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారాన్ని నిలుపుకుంది. ఆ తర్వాత 2019లో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. మరోసారి నిజామాబాద్ నుంచి కేసీఆర్ కూతురు కవిత పోటీ చేశారు. కానీ అప్పుడు ఆమె ఓడిపోయారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. తాజాగా జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ కుంటుంబం నుంచి ఎవరూ పోటీలో నిలవలేదు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్‌రావు ఈ నలుగురిలో ఎవరో ఒకరు కచ్చితంగా లోక్‌సభ బరిలో ఉంటారనీ అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు. ఎన్నికలకు ముందే కవిత లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ కావడంతో పరిణామాలు మారిపోయాయి. 2004 నుంచి ఇలా లోక్‌సభ ఎన్నికలకు కేసీఆర్ ఫ్యామిలీ సభ్యులు దూరంగా ఉండటం ఇదే తొలిసారి.