రేపు కారెక్కనున్న కౌశిక్‌రెడ్డి
Kaushik Reddy joins TRS Tomorrow.కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన కౌశిక్ రెడ్డి బుధవారం కారెక్కనున్నారు.
By తోట వంశీ కుమార్
కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన కౌశిక్ రెడ్డి బుధవారం కారెక్కనున్నారు. రేపు మధ్యాహ్నం సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు చెప్పారు.
హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు, తన మద్దతుదారుల కోరిక మేరకు.. టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నాను. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడిని అయ్యాను. సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. కాళేశ్వరం, లోయర్ మానేరు ప్రాజెక్టులతో రైతులు సంతోషంగా ఉన్నారు. రైతుబంధు పథకం ఈ నియోజకవర్గం నుంచే అమలు చేశారు. తెలంగాణ దళిత బంధు పథకం అమలుకు హుజురాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం గొప్ప విషయమన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని ఈటల రాజేందర్ దుర్వినియోగం చేశారు. ఈటల రాజేందర్ నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదు. తనకు తాను అభివృద్ధి చెందేందుకు నియోజకవర్గ ప్రజలను మోసం చేశారని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు.
రేవంత్‌రెడ్డి తనతో అన్ని పనులు చేయించుకుని మోసం చేశాడన్నారు. స్వంత తమ్ముడని చెప్పావు కదా రేవంత్ అన్నా.. ఆ మాట గుండె మీద చేయి వేసుకుని చెప్పాలన్నారు. రేవంత్‌రెడ్డి ది తొందరపాటు చర్యలని, తెలంగాణలో కాంగ్రెస్ ఖతం అవుతుందని కౌశిక్‌రెడ్డి అన్నారు. కాగా.. కౌశిక్ రెడ్డి ఆడియో టేపు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిన విషయం విదితమే. ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ను వివరణ కోరడం.. ఆ తర్వాత కౌశిక్ పార్టీకి గుడ్ బై చెప్పేయడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే.. కౌశిక్ టీఆర్‌ఎస్‌లో చేరితే ఉపఎన్నికలో ఆయనకు హుజురాబాద్ టికెట్ ఇస్తారా..? ఇవ్వరా..? అనే విషయం తెలియరాలేదు.