కరీంనగర్‌లో భారీ బ్యాంకింగ్ కుంభకోణం.. రూ. 137 కోట్ల అక్రమ లావాదేవీలు రట్టు!
కరీంనగర్ జిల్లాలో వెలుగుచూసిన భారీ మ్యూల్ అకౌంట్స్ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. అమాయకుల వివరాలు సేకరించి, వారి పేరుతో బ్యాంక్ ఖాతాలు తెరిచి...
By - అంజి |
కరీంనగర్‌లో భారీ బ్యాంకింగ్ కుంభకోణం.. రూ. 137 కోట్ల అక్రమ లావాదేవీలు రట్టు!
కరీంనగర్ జిల్లాలో వెలుగుచూసిన భారీ మ్యూల్ అకౌంట్స్ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. అమాయకుల వివరాలు సేకరించి, వారి పేరుతో బ్యాంక్ ఖాతాలు తెరిచి ఏకంగా రూ. 137 కోట్ల అక్రమ నగదును విదేశాలకు, క్రిప్టో కరెన్సీ ప్లాట్‌ఫారమ్‌లకు మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు 13 మందిని అరెస్ట్ చేయగా, మొత్తం 24 మంది నిందితులను గుర్తించినట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఈ అక్రమ దందాలో బ్యాంక్ ఉద్యోగులే సూత్రధారులుగా వ్యవహరించడం గమనార్హం.
బ్యాంక్ ఉద్యోగుల చేతివాటం:
ఈ స్కామ్‌లో RBL బ్యాంక్‌లో పనిచేస్తున్న కల్యాణ్, అయేషా అనే ఇద్దరు ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు. బ్యాంకింగ్ నిబంధనలను తుంగలో తొక్కి, అక్రమ డిపాజిట్లు మరియు క్రిప్టో ట్రేడింగ్ కోసం వీరు మ్యూల్ అకౌంట్లు (బినామీ ఖాతాలు) సృష్టించడంలో సహకరించారు. కేవలం 2 శాతం కమీషన్ ఆశచూపి అమాయక వ్యక్తుల నుంచి ఆధార్, పాన్ కార్డులు సేకరించి వారి ఖాతాల ద్వారా కోట్లాది రూపాయల లావాదేవీలు జరిపారు. కేవలం 8 ఖాతాల నుంచే సుమారు రూ. 137 కోట్ల మేర నగదు మళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది.
విదేశీ సంబంధాలపై ఆరా:
అరెస్టయిన వారిలో కల్యాణ్, అయేషా, సాయిరామ్, రంజిత్, మల్లేశం, సత్యం, బండి ప్రణయ్ వంటి కీలక సూత్రధారులు ఉన్నారు. ఈ అక్రమ సొమ్ము ఎక్కడి నుంచి వస్తోంది? విదేశాల్లోని ఎవరి ఖాతాలకు చేరుతోంది? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ దందాలో మరికొన్ని బ్యాంకుల ప్రమేయం ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. పరారీలో ఉన్న మరో 11 మంది నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. డిజిటల్ ఆర్థిక నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.