కరీంనగర్ కమిషనరేట్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ (సీపీఓ)కి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ISO) గుర్తింపు లభించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు శనివారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణకు సర్టిఫికెట్ అందజేశారు. కమిషనరేట్ పరిధిలోని పోలీసుల పనితీరు, పరిశుభ్రత, సౌకర్యాలు, బాధితుల సమస్యల సత్వర పరిష్కారం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ISO 9001 సర్టిఫికెట్‌కు ఎంపిక చేశారు. కమిషనరేట్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ (సీపీఓ) కేటగిరీలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కరీంనగర్ కమీషన్ రేటు మేటిగా నిలవడం విశేషం.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. ఐఎస్‌ఓ గుర్తింపుకు ఎంపిక కావడం తమ బాధ్యతను పెంచిందన్నారు. ఈ గుర్తింపుతో, సీపీఓలోని అన్ని స్థాయిల అధికారులు, సిబ్బందిలో కొత్త ఉత్సాహం నిండిందని, దీంతో మరిన్ని సమర్థవంతమైన సేవలను అందించడంలో సహాయపడతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు ఎస్ శ్రీనివాస్, జీ చంద్రమోహన్, ఏసీపీలు తుల శ్రీనివాస్‌రావు, విజయకుమార్, సీ ప్రతాప్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి మునిరత్నంతో పాటు పలువురు పోలీసు అధికారులు, మినిస్టీరియల్ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.