జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడిన వేళ కేసీఆరే కుమార్తె, కేటీఆర్ చెల్లెలు కల్వకుంట్ల కవిత ఎక్స్ లో పోస్ట్ చేసిన మెసేజ్ సంచలనంగా మారింది..! కర్మ హిట్స్ బ్యాక్(కర్మ తిరగబడి ఫలితం చూపెడుతోంది) అంటూ ఇంగ్లీష్‌లో ఓ పోస్టు పెట్టారు. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది.
సొంత బిడ్డ అని కేసీఆర్.. తోడపుట్టిన చెల్లి అని కేటీఆర్.. కనికరం చూపకుండా నిర్ధాక్షిణ్యంగా తనను పార్టీ నుండి వెళ్లగొట్టారని రగిలిపోతున్న కవిత.. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి చవిచూసిన వైనంపై గట్టిగానే స్పందించినట్లు కనిపిస్తోంది.
తనకు చేసిన అన్యాయం ఫలితం.. ఇపుడు జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితం రూపంలో వెనక్కి చూపెట్టిందని అన్నట్లుగా తండ్రి, అన్నపై ఆమె కామెంట్ చేసినట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ప్రధానంగా ఆమె కేటీఆర్‌ను ఉద్దేశించే అలా కామెంట్స్ చేసి ఉంటారనే అభిప్రాయం ఎక్కువగా వ్యక్తమవుతోంది..!
ఏదేమైనా ఘోర పరాజయంతో సిట్టింగ్ సీటు కోల్పోయి నిరాశ, నిస్పృహల్లో ఉన్న సమయంలో కవిత కామెంట్స్ పుండుమీద కారం చల్లినట్లుగా ఉన్నాయని.. ఆడబిడ్డ ఉసురు తగులుతోందంటూ రాజకీయ ప్రత్యర్థులు గులాబీ పెద్దలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.