కాళేశ్వరం ప్రాజెక్టు కేసు విచారణపై హైకోర్టు కీలక ఆదేశాలు

కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని...

By -  అంజి
Published on : 28 Feb 2026 8:53 AM IST

Kaleshwaram Project Probe, KCR High Court Case, PC Ghose Commission, Justice Alok Aradhe, Telangana Politics News, Medigadda Barrage Issue, Smita Sabharwal IAS, Harish Rao, Interim Protection Extended

కాళేశ్వరం ప్రాజెక్టు కేసు విచారణపై హైకోర్టు కీలక ఆదేశాలు

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (KCR), మాజీ మంత్రి టి. హరీష్ రావు, మాజీ సీఎస్ ఎస్.కె. జోషి, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌లకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో వీరికి ఇచ్చిన మధ్యంతర రక్షణను మార్చి 2, 2026 వరకు పొడిగిస్తూ చీఫ్ జస్టిస్ అపరేష్‌ కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం 2024 మార్చి 14న (GO 6) రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.సి. ఘోష్ నేతృత్వంలో కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఇచ్చిన నివేదికను సవాలు చేస్తూ కేసీఆర్ మరియు ఇతర అధికారులు హైకోర్టును ఆశ్రయించారు.

కేసీఆర్ తరపున సీనియర్ కౌన్సిల్ దమా శేషాద్రి నాయుడు, స్మితా సబర్వాల్ తరపున జె. రాంచందర్ రావు తమ వాదనలను వినిపించారు. సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘన: కమిషన్ విచారణ పేరుతో పిటిషనర్లను నేరుగా 'నిందితులు'గా తేల్చేసిందని, వారికి తమ రక్షణను చెప్పుకునే అవకాశం (Defence) ఇవ్వలేదని న్యాయవాదులు వాదించారు. సుమారు 190 మంది సాక్షుల నుంచి కమిషన్ స్టేట్‌మెంట్స్ తీసుకుందని, కానీ ఆ సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేసే హక్కును కేసీఆర్‌కు కల్పించలేదని తెలిపారు.

నివేదికను మీడియా ముందు బహిరంగపరచడం ద్వారా కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారని, ఇది ఆయన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసే చర్యని వాదించారు. విచారణ కమిషన్ చట్టం (Section 3) ప్రకారం కమిషన్ కేవలం విచారణ మాత్రమే చేయాలని, కానీ ఇక్కడ కమిషన్ ముందే ఒక నిర్ణయానికి వచ్చేసిందని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

పిటిషనర్ల వాదనలు విన్న ధర్మాసనం, తదుపరి విచారణను మార్చి 2వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు ప్రభుత్వం ఈ నివేదిక ఆధారంగా పిటిషనర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేసింది. ఎస్.కె. జోషి తరపు న్యాయవాది వాదనలు వచ్చే విచారణలో కొనసాగనున్నాయి.

Next Story