సొంత పార్టీపైనే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు!

Kadiyam Srihari Sensational Comments On TRS. టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ లో సొంత పార్టీపైనే సంచలన వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది.

By Medi Samrat  Published on  21 March 2021 11:35 AM IST
Kadiyam Srihari Sensational Comments On TRS

మాజీ ఉప ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ లో సొంత పార్టీపైనే సంచలన వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది. ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకొని పదవులు అమ్ముకుంటున్నారని ఓ ఎమ్మెల్యేను ఉద్దేశించి... కడియం శ్రీహరి చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి. చేతకానివాడు, ఒక్క రూపాయి కూడా సహాయం చేయనివాడు చాలా మాట్లాడుతాడని.. చెల్లని రూపాయి అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కొంతమంది చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్మే ప్రయత్నాలు చేస్తున్నారని.. పార్టీ ప్రతిష్ట దిగదార్చే పరిస్థితికి తీసుకు రావడం తనకు ఆవేదన కలిగిస్తుందని అన్నారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కరి దగ్గర ఛాయి తాగినా... పదవి ఇప్పిస్తాననో... పనులు ఇప్పిస్తాననో ఒక్క రూపాయి తీసుకోలేదన్నారు. అలా తీసుకున్నట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. కానీ ఇప్పుడు నెత్తిమీద పది రూపాయలు పెడితే అమ్ముడు పోనివారు కూడా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

పదవులు అమ్ముకుంటున్నారు, పనులు అమ్ముకుంటున్నారని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో తాను చేసిన పనులు వారికి కనబడుతాలేవా అని ప్రశ్నించారు. జనగామ జిల్లా జాఫర్గడ్ మండలం ఓబులపూర్ గ్రామంలో కబడ్డీ క్రీడల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పాల్గొని ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.




Next Story