గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ మేనిఫెస్టో చదివినట్లుంది: కడియం శ్రీహరి
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు.
By Srikanth Gundamalla Published on 15 Dec 2023 3:42 PM ISTగవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ మేనిఫెస్టో చదివినట్లుంది: కడియం శ్రీహరి
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం చేశారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. గవర్నర్ చేసిన ప్రసంగంలో కొత్తదనం లేదని అన్నారు. గతంలో గవర్నర్ ప్రసంగం ఎలా ఉండిందో.. ఇప్పుడెలా ఉందో ఒకసారి సమీక్ష చేసుకోవాలని కడియం శ్రీహరి అన్నారు.
గవర్నర్ ప్రసంగం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చదివినట్లు ఉందని అన్నారు కడియం శ్రీహరి. గత పదేళ్లుగా తెలంగాణలో అభివృద్ధి జరగలేదు అన్నట్లుగా ప్రసంగం ఇచ్చారని అన్నారు. కానీ.. జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం అనేక అవార్డులను అందుకున్న విషయం మర్చిపోయారని చెప్పారు. హర్యానా, పంజాబ్ రాష్ట్రాలను తలదన్ని వరి ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు. తలసరి ఆదాయం పెరిగింది నిజం కాదా అని కడియం శ్రీహరి ప్రశ్నించారు. ఐటీ ఉత్పత్తులు, ఎగుమతుల్లో హైదరాబాద్ బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించిందని చెప్పారు కడియం శ్రీహరి.
ప్రజలంతా ఇప్పుడు మాత్రమే సంతోషంగా ఉన్నట్లు గవర్నర్ ప్రసంగం ఉండటం ఏమాత్రం సరికాదని కడియం శ్రీహరి అన్నారు. పదేళ్లలో రాష్ట్ర ప్రజలంతా స్వేచ్ఛ వాయువుని పీల్చారనీ అన్నారు. తెలంగాణ నిర్బంధం నుంచి విముక్తి అయిందని గవర్నర్ చెప్పడం సరికాదన్నారు. గవర్నర్ ప్రసంగంలో అన్నీ అబద్దాలనే చేర్చారని.. ఇది దురదృష్టకరమని ఎమ్మెల్యే కడియం శ్రీమరి అన్నారు. అభివృద్ది, సంక్షేమ పథకాలకు సంబంధించిన రూట్ మ్యాప్ గవర్నర్ ప్రసంగంలో లేదని అన్నారు. అది ఉంటే బాగుండేదని అన్నారు. గవర్నర్ చేత రాష్ట్ర ప్రభుత్వం అన్నీ అసత్యాలనే చెప్పించిందనీ కడియం శ్రీహరి విమర్వించారు. దళితబంధు..మద్దతు ధరకు రూ.500 కలిపి కొంటామన్న వాగ్ధానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.