తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భుయాన్‌

Justice Ujjal Bhuyan appointed Chief Justice of Telangana High Court.తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Jun 2022 8:03 AM IST
తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భుయాన్‌

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్‌ ఉజ్జల్ భుయాన్‌ నియమితులయ్యారు. ఇప్పటి వరకు సీజే గా ఉన్న జస్టిస్‌ సతీశ్ చంద్రశర్మను ఢిల్లీ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా బదిలీ చేశారు. తెలంగాణ హైకోర్టులో రెండో సీనియర్‌ న్యాయమూర్తిగా ఉన్న భుయాన్‌ను సీజేగా నియమించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం మే 17న చేసిన సిఫారసుల‌కు రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్‌ కోవింద్ ఆమోదముద్ర వేయ‌గా.. ఆదివారం ఈ నియామ‌కాల‌ను నోటిఫై చేస్తూ కేంద్ర‌న్యాయ శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

1964 ఆగ‌స్టు 2న గువాహ‌టిలో జ‌న్మించారు ఉజ్జల్ భుయాన్‌. గువాహటీ ప్రభుత్వ న్యాయ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ, విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌ఎం ప‌ట్టా అందుకున్నారు. 1991లో అసోం బార్ కౌన్సిల్‌లో న్యాయ‌వాదిగా న‌మోదు చేసుకున్నారు. 16 ఏళ్ల పాటు ఆదాయపు పన్ను శాఖకు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, 2008 డిసెంబర్‌ 3న ఆదే శాఖకు సీనియర్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, 2002 నుంచి 2006 వరకు గువాహటీ హైకోర్టు-మేఘాలయ బెంచ్‌లో ప్రభుత్వ అదనపు న్యాయవాదిగా సేవ‌లందించారు. 2011 అక్టోబర్‌ 17న గువాహటి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013లో పూర్తిస్థాయి న్యాయమూర్తి అయ్యారు. 2019 అక్టోబర్‌ 3న బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2021 అక్టోబర్‌ 22న తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణ హైకోర్టు ఏర్పాటు అయిన‌ప్ప‌టి నుంచి ఇప్పటివరకు నలుగురు సీజేలు పనిచేశారు. జస్టిస్‌ రాధాకృష్ణన్‌, జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ హిమాకోహ్లీ, జస్టిస్‌ సతీశ్‌చంద్రశర్మ సీజేలుగా సేవలందించారు. జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ఐదో సీజే కానున్నారు.

Next Story