ఇది ఫైన‌ల్‌.. పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్‌లో చేరిక‌కు ముహూర్తం ఫిక్స్‌

Jupally Krishna Rao and Ponguleti Gives Clarity On Future Politics After AICC Key Meeting. మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు జులై 2న కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

By Medi Samrat  Published on  26 Jun 2023 4:05 PM GMT
ఇది ఫైన‌ల్‌.. పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్‌లో చేరిక‌కు ముహూర్తం ఫిక్స్‌

మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు జులై 2న కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఖమ్మంలో భారీ బహిరంగ సభ ద్వారా పార్టీలోకి చేరాల‌నుకుంటున్న పొంగులేటి, జూపల్లి ఆ సభకు రావాల్సిందిగా ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీని సోమ‌వారం ఆహ్వానించారు. ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన భేటీలో పొంగులేటి, జూపల్లితోపాటు దాదాపు 150 మంది నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేల‌తో సమావేశమయ్యారు. కాంగ్రెస్ నేత‌ల‌ను క‌లిసిన వారిలో ఎక్కువ మంది బీఆర్ఎస్ కు చెందిన వారే ఉండటం గమనార్హం.

స‌మావేశంలో పొంగులేటి, జూపల్లి తమ వెంట వస్తున్న నాయకులను రాహుల్, ఖర్గేలకు పరిచయం చేశారు. అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. పార్టీ వీడిన కాంగ్రెస్ నేతలంతా తిరిగి రావడం ఆనందంగా ఉందన్నారు. కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో నినాదంతో ముందుకు సాగాలని రాహుల్ పిలుపునిచ్చారు.

ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేతలు టీపీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, చిన్నా రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీ, మల్లు రవి, సంపత్, వంశీ చంద్ రెడ్డి, బలరాం నాయక్, రేణుకా చౌదరి, సీతక్క తదితరులు కూడా హాజరయ్యారు.

స‌మావేశం అనంత‌రం పొంగులేటి మాట్లాడుతూ.. కాంగ్రెస్ తో పాటు.. బీజేపీ నేతలు కూడా తనను, జూపల్లిని కలిసి పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించినట్లు తెలిపారు. అయితే రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందన్నారు. కర్నాటక విజయం తర్వాత అది మరింత పెరిగిందన్నారు. అటు రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందన్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ, ఖర్గేను కలిశాక నిర్ణయం తీసుకుందామని జూపల్లికి చెప్పానని శ్రీనివాస్ రెడ్డి వివ‌రించారు. రాహుల్ గాంధీని కలిశాక తమకు క్లారిటీ వచ్చిందని.. అందుకే తాను జూపల్లి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు తెలిపారు.


Next Story