టాలీవుడ్ సీనియర్ నటి జీవిత రాజశేఖర్ ఇటీవల తెలంగాణ బీజేపీ యూనిట్‌లో చేరారు. 2019 ఎన్నికలకు ముందు, జీవిత రాజశేఖర్ దంపతులు వైసీపీకి మద్దతునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు. అయితే జీవిత గానీ, రాజశేఖర్ గానీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జీవిత జహీరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయవచ్చని సమాచారం. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గానికి బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు.
బీజేపీలో చేరిన తర్వాత జీవిత అధికార టీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు, ఆ తర్వాత ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని ప్రతి క్లబ్, పబ్‌లో కేటీఆర్‌కు వాటా ఉందని ఆమె ఆరోపించారు. 2008లో జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంగా ప్రకటించబడింది. 2014, 2019 ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి టీఆర్‌ఎస్ నాయకుడు బీబీ పాటిల్ ఎంపీగా గెలిచారు. జహీరాబాద్ పార్లమెంటరీ సెగ్మెంట్‌లో బీజేపీకి గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది.
జీవితా రాజశేఖర్ కు జహీరాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తే పార్టీకి మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి ప్రత్యక్ష రాజకీయాల్లో సత్తా చాటాలని తహతహలాడుతున్న జీవతారాజశేఖర్ ఆశ నెరవేరుతుందా? ఆమెకు ఎంపీగా పోటీ చేసే అవకాశం వస్తుందా? జీవిత రాజశేఖర్ బీజేపీకి శక్తిగా మారనున్నారా? జహీరాబాద్ నుంచి అవకాశం ఇస్తే సత్తా చాటుతాడో లేదో భవిష్యత్తులో చూడాలి. ఈ విషయంపై భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలెవరూ నోరు మెదపకపోవడం గమనార్హం.