విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బచ్చన్నపేట పోలీస్‌స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ నవీన్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏవీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. రిటైర్డ్ ఎంపీడీఓ నల్లా రామకృష్ణయ్యను కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసును నవీన్ కుమార్ సరిగా విచారించలేదనే ఆరోపణల నేపథ్యంలో సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడ్డాయి.
జనగాం జిల్లా, బచ్చన్నపేట మండలం పొచ్చన్నపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ అధికారి జూన్ 15న అనుమానాస్పద పరిస్థితుల్లో కనిపించకుండా పోయారు. అనంతరం జూన్ 18న జనగాం పట్టణంలోని చంపక్ హిల్స్ వద్ద మృతదేహం లభ్యమైంది. కనిపించకుండా పోయారని చెప్పినప్పుడు నవీన్ కుమార్ ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయలేదనే ఆరోపణలు వచ్చాయి. నవీన్ కుమార్ విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించారని ఆరోపించారు. MPDO నల్లా రామకృష్ణయ్య కేసు విషయంలో FIR నమోదు చేయకపోవడం, గతంలో నమోదైన పలు కేసుల్లో అలసత్వంతో వ్యవహారించినందుకు బచ్చన్నపేట ఎస్.ఐ. నవీన్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది.