Jangaon: టిఫిన్ సెంటర్‌ను ఢీకొట్టిన బస్సు, ముగ్గురు దుర్మరణం
జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 13 May 2024 12:58 PM ISTjangaon: టిఫిన్ సెంటర్‌ను ఢీకొట్టిన బస్సు, ముగ్గురు దుర్మరణం
జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఉన్న మొబైల్ టిఫిన్ సెంటర్‌ను మితిమీరిన వేగంతో వచ్చిన బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
జనగామ జిల్లాలోని రఘునాథ్‌పల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హెచ్‌పీ పెట్రోల్ బంక్ దగ్గర మొబైల్ టిఫిన్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకున్నారు కొందరు. అయితే... ఇదే రహదారిపై ఉదయం ఆర్టీసీ గరుడ బస్సు మితిమీరిన వేగంతో దూసుకొచ్చింది. మొబైల్ టిఫిన్ సెంటర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడ్డ వారిలో మహిళతో పాటు ఒక బాలుడు ఉన్నాడు. మరికొందరికి స్వల్పగాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడ్డవారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
మరోవైపు మృతిచెందిన వారిని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించామని పోలీసులు వెల్లడించారు. వారివారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామన్నారు. రోడ్డుప్రమాదం జరిగిన చోట భీకర పరిస్థితులు కనిపించాయి. మొబైల్ టిఫిన్ సెంటర్‌లో ఉన్న వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామనీ.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.