లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జనగామ DMHO

జనగామ జిల్లాలో అవినీతి అధికారులు ఏసీబీ వలలో చిక్కారు.

By Srikanth Gundamalla  Published on  11 Jan 2024 4:00 PM GMT
Jangaon, DMHO,   ACB,   bribe,

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జనగామ DMHO

గౌరవమైన ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి కూడా కొందరు అధికారులు లంచాలకు ఆశపడుతున్నారు. ఇలా ఎంతో మంది లంచాలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడి జైలుపాలు అయ్యారు. అంతేకాదు.. సమాజంలో గౌరవాన్ని కోల్పుతున్నారు. ఇలాంటివి జరుగుతున్నా కూడా లంచాలు తీసుకునేవారికి బుద్ధి రావడం లేదు. తాజాగా జనగామ జిల్లాలో అవినీతి అధికారులు ఏసీబీ వలలో చిక్కారు.

జనగామ జిల్లాలో డాక్టర్‌ ప్రశాంత్‌ డీఎంహెచ్‌వో అధికారిగా పనిచేస్తున్నాడు. మహ్మద్‌ అజారు జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే.. ఔట్‌ సోర్సింగ్‌లో ఫార్మసిస్టుగా పనిచేస్తోన్న స్రవంతి అనే మహిళ జాబ్‌ రెన్యువల్‌ కోసం వచ్చింది. జాబ్‌ రెన్యువల్‌ కావాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలని డీహెచ్‌ఎవో, జూనియర్‌ అసిస్టెంట్‌ డిమాండ్ చేశారు. అంత డబ్బు తాను ఇచ్చుకోలేనని చెప్పినా వారు వినలేదు. డబ్బులు ఇస్తేనే ఉద్యోగం దొరుకుతుందని అన్నారు. దాంతో ఏం చేయలేక మూడు నెలల పాటు అధికారుల చుట్టూ తిరిగింది. అయినా కనికరించలేదు. చివరకు రూ.50వేలు ఇచ్చుకుంది. అయినా.. డీఎంహెచ్‌వో తన జాబ్‌ను రెన్యువల్‌ చేయలేదు.

ఇంకా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు బాధితురాలు ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. బాధిత మహిళ నుంచి జూనియర్ అసిస్టెంట్‌, డీఎంహెచ్‌వో ఇద్దరూ కలిసి రూ.50వేలు తీసుకుంటండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు వివరాలు ఏసీబీ వరంగల్‌ డీఎస్పీ సాంబయ్య వెల్లడించారు. ప్రశాంత్, మహమ్మద్ అజారులను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.





Next Story