జనగామ టికెట్ కోసం కేసీఆర్ ఫ్లెక్సీకి సాష్టాంగ నమస్కారం
జనగామ బీఆర్ఎస్ టికెట్ తనకే కేటాయించాలని కోరుతూ.. మండల శ్రీరామలు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి సాష్టాంగ నమస్కారం చేశారు.
By Srikanth Gundamalla Published on 28 Aug 2023 6:20 AM GMTజనగామ టికెట్ కోసం కేసీఆర్ ఫ్లెక్సీకి సాష్టాంగ నమస్కారం
తెలంగాణలో ఎన్నికల వేడి షురూ అయ్యింది. బీఆర్ఎస్ ఇప్పటికే ఎన్నికల కోసం 95 శాతం మంది అభ్యర్థులను ప్రకటించింది. దాంతో.. ఎన్నికల రణరంగం అప్పుడే మొదలైందా అనిపిస్తోంది. అధికారపార్టీ అందరి కంటే ముందుండటంతో ప్రతిపక్షాలు కూడా తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించడం కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. అధికారపార్టీ నుంచి టికెట్ లభించని వారు.. ఆశావాహులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇచ్చారు. కేవలం ఏడు చోట్ల మాత్రమే మార్పులు చేశారు. ఇక నాలుగు చోట్ల మాత్రమే అభ్యర్థులను కేసీఆర్ ఇంకా ప్రకటించలేదు.
జనగామ, గోషామహల్, నర్సాపూర్, నాంపల్లి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించలేదు. జనగామ బీఆర్ఎస్ టికెట్ విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ కొనసాగుతోంది. మరోనేత ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కూడా జనగామ టికెట్ ఆశిస్తున్నారు. ఎవరికి వారు మద్దతు కూడగట్టుకుని అధిష్టానం నుంచి టికెట్ కేటాయించాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆప్కో మాజీ చైర్మన్ మండల శ్రీరాములు తనకు టికెట్ కావాలని కోరుతున్నారు. స్థానికేతరులైన పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తమ ప్రయత్నాలు మానుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారితో కలిసి జనగామలో ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మండల శ్రీరాములు.. ఇద్దరు ఎమ్మెల్సీలకూ ఇంకా పదవీ కాలం ఉందని చెప్పారు. ఎమ్మెల్యే కావాలని ఉంటే.. వారి వారి సొంత నియోజకవర్గాల్లో ప్రయత్నాలు చేసుకోవాలని పేర్కొన్నారు. తాను బీసీ వర్గానికి చెందిన వాడినని.. తనకే టికెట్ కేటాయించాలని కోరారు. అంతేకాదు.. అక్కడ ఉన్న సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి శ్రీరాములు సాష్టాంగ నమస్కారం చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.