ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి షాకిచ్చిన కూతురు.. నోటీసు బోర్డు పెట్టి మరీ..
బీఆర్‌ఎస్ సీనియర్ నేత, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి, ఆయన కూతురు తుల్జ భవాని రెడ్డి మధ్య గత కొంత కాలంగా
By అంజి Published on 25 Jun 2023 1:32 PM IST
ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి షాకిచ్చిన కూతురు.. నోటీసు బోర్డు పెట్టి మరీ..
బీఆర్‌ఎస్ సీనియర్ నేత, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి, ఆయన కూతురు తుల్జ భవాని రెడ్డి మధ్య గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది. చేర్యాల ఊరి చెరువు భూమి ఆక్రమణ విషయమై తండ్రి కూతురికి మధ్య గొడవ జరుగుతోంది. ఆ భూమిని తన తండ్రి ముత్తిరెడ్డి అక్రమంగా తన పేరుపై రిజిస్ట్రేషన్ చేశారని ఆమె చేశారని ఆరోపించారు. తాజాగా ఇవాళ ఈ వివాదం కీలక పరిణామం చోటు చేసుకుంది. చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు మత్తడి వద్ద తన పేరిట ఉన్న 1270 గజాల స్థలం చుట్టూ ముత్తిరెడ్డి ఏర్పాటు చేసిన గోడును భవాని రెడ్డి కూల్చేశారు.
''నా తండ్రి ఊరి భూమి కబ్జా చేసి నా పేరున రిజిస్ట్రేషన్ చేసినందుకు నేను చేర్యాల ప్రజలను నన్ను క్షమించమని అడుగుతున్నాను. నా తండ్రి నా పేరున పెట్టిన యావదాస్తి చేర్యాల మున్సిపాలిటీకి, చేర్యాల హాస్పిటల్‌కు రిజిస్ట్రేషన్ చేయుచున్నాను'' అనే సందేశంతో తన పేరిట ఉన్న 21 గుంటల స్థలంలో ఎమ్మెల్యే కూతురు తుల్జా భవానీ నోటీసు బోర్డు పెట్టారు. ఆదివారం నాడు తుల్జా భవానీ మీడియాతో మాట్లాడారు. ఈ భూమిని కలెక్టర్‌కు అప్పగిస్తానని చెప్పారు. తప్పు జరిగిందన్న ఆమె.. మత్తడి భూమిని తన పేరిట తెలియకుండానే తన తండ్రి రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు.
తాను ఈ తప్పును కరెక్ట్ చేసుకుంటున్నానని చెప్పారు. ఆ భూమిని చేర్యాల మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేయిస్తానన్నారు. ప్రస్తుతం డాక్యుమెంట్ రెడీగా ఉందని, భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ భూమిని కోర్టు ద్వారా కలెక్టర్‌కు అప్పగిస్తానని తెలిపారు. ఇలాంటి పని తన తండ్రి చేయకూడదని, కానీ రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి, 70 సంవత్సరాల వ్యక్తి ఇలా చేయడం సరికాదన్నారు. ఎమ్మెల్యే కాక ముందే ఆయనకు 1000 కోట్ల ఆస్తి ఉందని, నెలకు కోటిన్నర దాకా రెంట్ వస్తుందని తెలిపారు.
అలాంటి వ్యక్తి ఇలాంటి భూమి తీసుకోకూడదని, తప్పు జరిగిందని, క్షమించండి తిరిగి ఇచ్చేస్తా అని భవాని రెడ్డి అన్నారు. గతంలో ఈ భూమి కబ్జాకు గురైందని స్థానిక ప్రజలు, విపక్ష నాయకులు, ప్రజా సంఘాలు ఆరోపిస్తు ఆందోళనలు చేశాయి. ప్రభుత్వం భూమిని కాపాడాలని డిమాండ్ చేశాయి. అప్పట్లో ఈ కబ్జా విషయాన్ని అధికారులు లెక్కచేయలేదని విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఎమ్మెల్యే కూతురే స్వయంగా వచ్చి ఆ భూమిని మున్సిపాలిటీకి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.